జ్ఞానదేవుడి గొప్పతనం

జ్ఞానదేవుడి గొప్పతనం
జ్ఞానదేవుడు ... నామదేవుడు పాండురంగడి భక్తులు. ఇద్దరూ కూడా ఆ స్వామిని కీర్తిస్తూ వివిధ క్షేత్రాలను దర్శించేవారు. ఈ నేపథ్యంలోనే నామదేవుడిని 'గోరా కుంభార్' అనే భక్తుడి ఇంటికి తీసుకువెళ్లాడు జ్ఞానదేవుడు. గోరా భక్తి శ్రద్ధల గురించి నామదేవుడికి గొప్పగా చెప్పాడు. అయితే ఆయన మాటలను నామదేవుడు పెద్దగా పట్టించుకోలేదు. పైగా మట్టి కుండలు చేసుకునే వ్యక్తి తమకన్నా గొప్ప భక్తుడు ఎలా అవుతాడని వ్యంగంగా మాట్లాడాడు.

దాంతో నామదేవుడి కళ్ళు తెరిపించాలని జ్ఞానదేవుడు నిర్ణయించుకున్నాడు. మట్టికుండలు కావలసినంతగా కాలాయో లేదోననే విషయాన్ని చెక్కదిమ్మతో కొట్టి తెలుసుకోవడంలో గోరాకి ఎంతో అనుభవముందనీ, అలాగే చెక్కదిమ్మతో తమ తలని తట్టి తమ పరిపక్వతను కూడా ఆయన చెప్పగలడని నామదేవుడితో అన్నాడు. అక్కడున్న వారందరి తలపై ఆ చెక్కదిమ్మతో తట్టి పూర్తిగా కాలిన కుండయేదో చెప్పమని గోరాను కోరాడు.

ఆయన మాటను కాదనలేక అందరినీ పరీక్షించాడు గోరా. నామదేవుడిని ఉద్దేశించి, ఆయన సగం కాలిన కుండ అని చెప్పాడు. ఆ మాటకు అక్కడున్న వాళ్లంతా నవ్వడంతో నామదేవుడు ఆగ్రహావేశాలకు లోనయ్యాడు. తన పరిపక్వతను పరీక్షించే స్థాయి గోరాకి లేదంటూ విసురుగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. నేరుగా పాండురంగస్వామి ఆలయానికి వెళ్లి గోరా వలన తనకి జరిగిన అవమానాన్ని గురించి స్వామిచెంత ఆవేదనను వ్యక్తం చేశాడు.

గోరా చెప్పినది నిజమేననీ ... అహంకారం నశించిన చోటు నుంచే ఆత్మజ్ఞానం కలుగుతుందనీ, గురువు యొక్క అనుగ్రహంతో దానిని సాధించమని చెప్పాడు పాండురంగడు. దాంతో ఆత్మజ్ఞానాన్ని సాధించడం కోసం అక్కడి నుంచి బయలుదేరాడు నామదేవుడు. విషయం తెలుసుకున్న జ్ఞానదేవుడు తన ప్రయత్నం ఫలించినందుకు మనసులోనే సంతోషించాడు.

More Bhakti Articles