దేవీ నవరాత్రులు

దేవీ నవరాత్రులు
జగజ్జనని ... ఆదిపరాశక్తి అయిన అమ్మవారు లోకకల్యాణం కోసం ఒక్కోరోజు ఒక్కోరూపంలో తొమ్మిది రోజులపాటు తొమ్మిదిమంది రాక్షసులను సంహరించింది. అమ్మవారు సాధించిన విజయానికి గుర్తుగా ఆ తల్లిని ఆరాధిస్తూ ఈ తొమ్మిది రోజులపాటు ఉత్సవాలు జరపబడుతుంటాయి. వీటినే 'దేవీ నవరాత్రులు' అని అంటూ వుంటారు. అమ్మవారి అనుగ్రహాన్ని పొందడానికి అత్యంత విశిష్టమైన రోజులుగా 'దేవీ నవరాత్రులు' చెప్పబడుతున్నాయి. ఈ నవరాత్రులు శరదృతువులో ఆరంభమవుతాయి కనుక వీటిని 'శరన్నవరాత్రులు' అని కూడా అంటారు.

ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి నుంచి నవమి వరకూ శరన్నవరాత్రులుగా చెప్పబడతాయి. అయితే సూర్యోదయానికి అమావాస్య లేని రోజున మాత్రమే వీటిని ప్రారంభించడం జరుగుతుంది. అమావాస్య రోజున నవరాత్రి దీక్షను చేపట్టడంగానీ, కలశస్థాపనగాని చేయకూడదు. ఈ నియమాన్ని ఉల్లంఘించడం వలన పెద్ద సంతానానికి హాని కలుగుతుందని కూడా శాస్త్రం చెబుతోంది. అందువలన విదియతో కూడిన పాడ్యమి రోజును మొదటిరోజుగా భావించి నవరాత్రులను ఆరంభిస్తుంటారు.

పాడ్యమి నుంచి నవమి వరకు అంటే తొమ్మిది రోజుల పాటు అమ్మవారిని ఒక్కో రోజున ఒక్కో రూపంలో ఆరాధించడం జరుగుతుంటుంది. కొందరు బాలాత్రిపురసుందరి ... గాయత్రి ... అన్నపూర్ణ వరుసలో అమ్మవారిని కొలిస్తే, మరికొందరు శైలపుత్రి ... బ్రహ్మచారిణి .. చంద్ర ఘంట వరుసలో అమ్మవారి నవవిధ రూపాలను ఆరాధిస్తూ వుంటారు. ఈ నవరాత్రులలో దీక్షను చేపట్టి కలశస్థాపనతో పూజను ప్రారంభించవలసి వుంటుంది. అంతకు ముందు కలశ స్థాపన చేసే ఆనవాయతీ లేని వారు కూడా కలశ స్థాపన చేసుకోవచ్చు.

అయితే ఒకసారి కలశస్థాపనతో దేవీ పూజను ప్రారంభించాక, ప్రతి ఏడాది కలశస్థాపన చేసుకోవలసి వుంటుంది. ఇంట్లో కలశస్థాపన చేసుకున్న వారు ఎంతో నియమ నిష్టలతో వ్యవహరించవలసి వుంటుంది. నవరాత్రి దీక్షను చేపట్టిన వాళ్లు ప్రతి రోజూ ఉదయాన్నే తలస్నానం చేసి .. పరిశుభ్రమైన వస్త్రాలను ధరించి .. భక్తి శ్రద్ధలతో అమ్మవారిని పూజించాలి. ఒక పూట మాత్రమే భోజనం చేస్తూ ... బ్రహ్మచర్యాన్ని పాటించాలి.

ఇక ఈ నవరాత్రులలో కుమారీపూజ .. సువాసినీ పూజ .. దంపతి పూజ విశేషమైన ఫలితాలను ఇస్తాయని శాస్త్రం చెబుతోంది. అయితే అమ్మవారిని తొమ్మిది రోజులపాటు ఆరాధించడం సాధ్యపడని పరిస్థితుల్లో తదియ నుంచి నవమి వరకు (ఏడు రోజులు) గానీ, పంచమి నుంచి నవమి వరకు (అయిదు రోజులు)గానీ, సప్తమి నుంచి నవమి వరకు (మూడు రోజులు)గాని అమ్మవారిని పూజించవచ్చని శాస్త్రం స్పష్టం చేస్తోంది.

నవరాత్రులలో చండీ పారాయణం .. లలితా సహస్ర నామం చేయడం వలన అనంతమైన పుణ్య ఫలాలు ప్రాప్తిస్తాయి. ఈ రోజుల్లో అమ్మవారికి ఇష్టమైన పాయసం ... బెల్లం పరమాన్నం ... పెసరగారెలు నైవేద్యంగా సమర్పించాలి. ఈ విధంగా చేయడం వలన గ్రహ సంబంధమైన దోషాలు తొలగిపోతాయని చెప్పబడింది.

More Bhakti Articles