రాయచోటి

రాయచోటి
దక్షప్రజాపతిని సంహరించడం కోసం రుద్రుడి యొక్క అంశతో జన్మించిన వీరభద్రుడు, ఆ తరువాత అనేక ప్రాంతాల్లో కొలువై నిత్యపూజలు అందుకుంటున్నాడు. అలాంటి క్షేత్రాల్లో కడప జిల్లాలోని 'రాయచోటి' ఒకటిగా చెప్పబడుతోంది. ఈ ప్రదేశానికి స్వామి స్వయంగా వచ్చి అవతరించాడని స్థల పురాణం చెబుతోంది.

క్రీ.శ.8 వ శతాబ్దానికి ముందుగానే ఇక్కడి స్వామి పూజలు అందుకున్నట్టుగా ఆధారాలు వున్నాయి. ఆ తరువాత వచ్చిన పాలకుల కారణంగా ఈ క్షేత్రం మరింత వైభవాన్ని సంతరించుకుందని అంటారు. రాజులు యుద్ధాలకి ముందు తమ ఖడ్గాలను ఈ స్వామి చెంత వుంచి పూజలు చేయించేవారట. యుద్ధంలో విజయం సాధించిన తరువాత, ఆ ఖడ్గాలను స్వామికి కానుకగా సమర్పించేవారు.

రాజులకే రాజుగా ఇక్కడి స్వామిని భావించడం వలన అంతా స్వామిని 'రాచరాయుడు' గా పిలుచుకునేవారు. దాంతో ఈ ప్రాంతానికి 'రాచవీడు' అనే పేరు వచ్చింది. కాలక్రమంలో అదికాస్తా 'రాయచోటి'గా మారిందని అంటారు. ఆలయ విస్తీర్ణం ... నిర్మాణ శైలి ... శిల్పాలను మలిచినతీరు నాటి ప్రాచీన వైభవానికి అద్దం పడుతుంటాయి. గర్భాలయంలో వీరభద్రుడు సౌమ్య మూర్తిగా కనిపించడం, స్వామివారికి ఎదురుగా జంట నందులు కొలువై వుండటం ఇక్కడి విశిష్టతగా చెబుతుంటారు. గర్భాలయానికి పక్కనే గల ప్రత్యేక మందిరంలో భద్రకాళీ కొలువై వుంటుంది.

కాలభైరవుడు క్షేత్రపాలకుడిగా వ్యవహరిస్తోన్న ఈ క్షేత్రంలో గణపతి ... కుమారస్వామి ... సదాశివుడు పూజలు అందుకుంటూ వుంటారు. పర్వదినాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు ... ఉత్సవాలు జరుగుతూ వుంటాయి. నవరాత్రుల సందర్భంగా అమ్మవారికి నవదుర్గల అలంకారాలు అద్భుతంగా చేస్తారు. ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన అన్ని విషయాల్లోనూ ఆటంకాలు తొలగిపోయి, కార్యసిద్ధి కలుగుతుందని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.

More Bhakti Articles