ఫలితం లేని పఠనం

ఫలితం లేని పఠనం
దైవశక్తి ఒక్కటే అయినా ఆ శక్తిని అనేక రూపాల్లో పూజించడం అనాదిగా వస్తోంది. ఈ నేపథ్యంలో ఎవరి ఇష్టదైవాన్ని వాళ్లు పూజిస్తూ ... ఆరాధిస్తూ వుంటారు. ఆ దైవాలకి సంబంధించిన శ్లోకాలను ... అష్టోత్తరాలను .. సహస్రనామాలను భక్తి శ్రద్ధలతో చదువుతూ వుంటారు. ఆయా దైవాలకి సంబంధించిన గ్రంధాలను పారాయణ చేస్తుంటారు.

నిజానికి పూజ అనేది పరిశుభ్రమైన శరీరంతో ... పవిత్రమైన మనసుతో ప్రశాంతమైన వాతావరణంలో చేయవలసి వుంటుంది. అప్పుడే భగవంతుడిపై మనసు ... దృష్టి నిలపడానికి అవకాశం కలుగుతుంది. ఇక ఒకసారి పూజా మందిరం దగ్గర కూర్చున్న తరువాత పూజను పూర్తి చేయవలసి వుంటుంది. అయితే మారుతోన్న జీవన విధానం వలన, చాలా మంది ఈ నియమాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదు.

పూజా మందిరంలో దీపారాధన ... నైవేద్యం ... హారతి కానిచ్చేసి, ఉద్యోగాలరీత్య గానీ ... వ్యాపారాల రీత్య గాని బయటపడుతున్నారు. తమ కార్యాలయాలకి చేరుకునేలోగా బస్సుల్లోను ... రైళ్లలోనూ స్తోత్రాలు చదవడం ... పారాయణాలు చేయడం ... అష్టోత్తరాలు ... సహస్రనామాలు చదవడం చేస్తున్నారు. ఈ విధంగా చేయడం వలన ఎలాంటి పుణ్యఫలాలు లభించవని శాస్త్రం చెబుతోంది.

ఒక పని అయిపోయిందికదా అనే విధంగా మొక్కుబడిగా చేసే ఇలాంటి పనుల వలన ఎలాంటి ప్రయోజనం వుండదు. స్తోత్రం ... పారాయణం ... జపం ఏదైనా సరే పవిత్రంగా ... ప్రశాంతంగా వుండే ప్రదేశాల్లో మాత్రమే చేయాలి గానీ, ఎక్కడపడితే అక్కడ పరిసరాలతో సంబంధం లేకుండా చేయకూడదని శాస్త్రం స్పష్టం చేస్తోంది. అందువలన దైవ సంబంధమైన ఏ పనైనా సరే మనసు ... శరీరం ... ప్రదేశం ... పరిసరాలు ఇవన్నీ కూడా పవిత్రంగా ఉన్నప్పుడే చేయాలనే నియమాన్ని తప్పనిసరిగా గుర్తుంచుకోవలసిన అవసరం వుంది.

More Bhakti Articles