రాజుగారిని రప్పించిన త్యాగయ్య

రాజుగారిని రప్పించిన త్యాగయ్య
శ్రీరాముడి అనుగ్రహం కారణంగా త్యాగయ్య నోటి నుంచి ఆశువుగా ... అమృతంలా అనేక కీర్తనలు వెలువడసాగాయి. ఆ సంగీతానికీ ... సాహిత్యానికి అంతా మంత్రముగ్ధులు కాసాగారు. త్యాగయ్యకి తొలినాళ్లలో సంగీత పాఠాలు నేర్పించిన వెంకటరమణయ్య, త్యాగయ్య గొప్పతనం గురించి 'శరభోజీ' మహారాజుతో చెప్పాడు. త్యాగయ్య కీర్తనల్లో ఏదో తెలియని తియ్యదనం ... మహత్తు వున్నాయని అన్నాడు.

దాంతో త్యాగయ్య కీర్తనలను వినాలనుకున్న శరభోజీ మహారాజు, ఆయనకి ఖరీదైన కానుకలు పంపించి తాను రమ్మని చెప్పినట్టుగా కబురుచేశాడు. మహారాజు పంపించిన కానుకలు చూసి ఆయన అన్నావదినలు ఆనందాశ్చర్యాలకి లోనయ్యారు. ఆర్ధికంగా తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న తరుణంలో వచ్చిన లక్ష్మీదేవిని నిరాకరించవద్దని త్యాగయ్యతో చెప్పారు. నిధికన్నా శ్రీరాముడి సన్నిధియే సుఖమంటూ సున్నితంగా వాటిని తిరస్కరించాడు త్యాగయ్య.

తన మాట కాదన్నందుకు త్యాగయ్యపై ఆయన అన్నగారికి కోపం వచ్చింది. ఇకమీదట ఎవరి బతుకు వాళ్లు బతకడమే మంచిదని ఆయన తేల్చి చెప్పేశాడు. త్యాగయ్య ఎన్నివిధాలుగా నచ్చజెప్పినా ఆయన అన్నావదినలు వినిపించుకోలేదు. దాంతో కట్టుబట్టలతో ... భార్యతో ... సీతారాముల ప్రతిమలతో ఆయన ఆ ఇంట్లోనుంచి బయటికి వచ్చేశాడు. తప్పనిసరి పరిస్థితుల్లో ఆయన ఆ ఊళ్లోనే ఆ వీధిలోనే వేరే ఇంట్లో ఉండసాగాడు.

ఆ రోజున త్యాగయ్య తానురాసిన కృతులను స్వామివారికి సమర్పించేందుకు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఈ కార్యక్రమాన్ని ఒక వేడుకలా జరపడానికి గ్రామస్తులు సహాయ సహకారాలను అందించారు. త్యాగయ్య తన ఆస్థానానికి రావడానికి నిరాకరించడం శరభోజీ మహారాజుకి ఆగ్రహాన్ని కలిగించలేదు. అంతటి భక్తుడి దగ్గరికి స్వయంగా వెళ్లి కీర్తనలు విని తరించాలని అనుకున్నాడు.

మారువేషంలో త్యాగయ్య ఇంటికి చేరుకుని,అక్కడి గ్రామస్తులలో తానూ ఒకడిగా కలిసిపోయాడు.సీతారాములకి పవళింపు సేవను చేస్తూ త్యాగయ్య కీర్తనలు పాడుతూ ఉండటాన్ని చూసి పరవశించిపోయాడు. ఆ మహనీయుడు వున్న కారణంగానే తన రాజ్యం సుభీక్షంగా ఉంటోందని భావించాడు. ఆయన దర్శనభాగ్యం లభించడం నిజంగా తన అదృష్టమని భావించి మనస్పూర్తిగా నమస్కరించాడు.

More Bhakti Articles