మహాదేవ క్షేత్రం

మహాదేవ క్షేత్రం
అడుగడుగునా ... అణువణువునా సాక్షాత్కరించే దైవానికి పల్లె ... పట్టణం అనే తేడాలేదు. తనకి నచ్చిన ప్రదేశాల్లో ... తన భక్తులు నివసించే ప్రదేశాల్లో ఆయన కొలువుదీరుతుంటాడు. ఈ కారణంగానే కొన్ని పుణ్య క్షేత్రాలు మారుమూల గ్రామాల్లో దర్శనమిస్తూ వుంటాయి. స్వామి ఆవిర్భవించిన కారణంగా ఆ పల్లెలు పవిత్రమవుతాయి ... పుణ్యక్షేత్రాలై వెలుగొందుతాయి. అలాంటి పుణ్యక్షేత్రాల సరసన పశ్చిమ గోదావరి జిల్లాకి చెందిన 'వీరంపాలెం' కూడా దర్శనమిస్తుంది.

ఈ గ్రామానికి వెళ్లిన వాళ్లు ఇక్కడున్న ఆధ్యాత్మిక ప్రపంచాన్ని చూసి ఆశ్చర్యపోతారు. వెంటనే తిరిగివెళ్లడానికి వాళ్ల మనసు కూడా అంగీకరించదు. పచ్చని పంటపొలాల మధ్య మహాదేవుడు నెలకొని ఉంటాడు. చల్లదనాన్ని కోరుకునే సదాశివుడికి చల్లని గాలి నిరంతరం అభిషేకం చేస్తూనే వుంటుంది. విశాలమైన ఆలయ ఆవరణలో ఆదిదంపతులు .. శివుడి కోసం ప్రార్ధించే భగీరథుడు .. గంగను తన కొప్పులో బంధిస్తోన్న శివుడు .. అర్థనారీశ్వరుడు .. శిరిడీ సాయిబాబా ప్రతిమలు దర్శనమిస్తాయి. అయితే ప్రతి ప్రతిమ కూడా 40 అడుగులు మించి వుండటం విశేషం.

ద్వాదశ జ్యోతిర్లింగాలకు ప్రతీకలుగా ఆలయ ప్రాంగణంలో 12 శివలింగాలు వరుసగా కొలువై వుంటాయి. అందమైన రాజగోపురం .. శిల్పకళా శోభితమైన ప్రాకారాలు .. యజ్ఞశాల .. ముఖద్వారంలో నెలకొన్న 'అష్టముఖ గణపతి' .. భక్తిభావ పరిమళాలను వెదజల్లుతూ వుంటాయి. గర్భాలయంలో మహాదేవుడు కొలువైవుండగా, ఆ పక్కనేగల ప్రత్యేక మందిరంలో బాలా త్రిపురసుందరి కొలువుదీరి వుంటుంది. విభూతి రేఖలతో ... చూడచక్కని నేత్రాలతో ... కోర మీసాలతో ఇక్కడి శివలింగం దర్శనమిస్తూ వుంటుంది.

పర్వదినాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు ... ఉత్సవాలు జరుగుతుంటాయి. ఈ సందర్భంగా తరలివచ్చే భక్తులను చూసి మహాశివుడు మహదానంద పడిపోతుంటాడు. ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆదిదంపతుల దర్శనభాగ్యం వలన కుటుంబ జీవనం ఎలాంటి ఒడిదుడుకులు లేకుండా హాయిగా సాగిపోతుంది.

More Bhakti Articles