పాతివ్రత్య మహిమ

పాతివ్రత్య మహిమ
సిరియాళుడు ఆయన భార్య పార్వతి నిరంతరం శివపూజలోనే కాలం గడిపేవారు. తమ దగ్గరికి ఎవరు వచ్చి ఏది అడిగినా లేదనకుండా ఆ శివుడు అనుగ్రహంతో దానధర్మాలు చేసేవాళ్లు. భగవంతుడు తమకి కల్పించిన దానిని కష్టాల్లో ఉన్నవారికి దానం చేయడం ప్రతి రోజూ ఒకపనిగా పెట్టుకున్నారు. దాంతో దానం స్వీకరించేవారు ఉదయాన్నే ఆయన ఇంటిముందు బారులు తీరేవారు.

అలాంటి పరిస్థితుల్లో వారి ఇంటికి ఒక సాధువు వచ్చాడు. జీవితం పట్ల ఆయన తీవ్రమైన నిరాశా నిస్పృహలను కలిగి ఉండటాన్ని సిరియాళుడు గమనించాడు. కావలసినదేవిటో చెబితే భగవంతుడి అనుగ్రహంతో ఇవ్వడానికి ప్రయత్నిస్తానని ఆయనతో చెప్పాడు. చాలాకాలంగా తానొక శాపంతో బాధపడుతున్నానని చెప్పాడు సాధువు. ఆ శాపం కారణంగా తాను అన్నపానియాలు కూడా తీసుకోలేని పరిస్థితుల్లో వున్నానని అన్నాడు.

శాపవిమోచనానికి ఏం చేయాలో చెప్పమనీ, అది ధర్మ సమ్మతమే అయితే వెనుకాడనని అన్నాడు సిరియాళుడు. ఆ శాపం నుంచి తనకి విమోచనం కలగాలంటే పతివ్రత 'చనుబాలు' తాగాలని చెప్పాడు సాధువు. అది అసాధ్యం కనుక రోజురోజుకీ తన పరిస్థితి క్షీణిస్తోందని ఆవేదన వ్యక్తం చేశాడు. వారి వలన తనకి శాపవిమోచనం కలుగుతుందనే ఆశతో వచ్చానని అన్నాడు. ఆ మాట వినగానే సిరియాళుడు ఆలోచనలో పడ్డాడు.

అయితే ఆయన భార్య పార్వతి ఏ మాత్రం ఆలోచించకుండా అందుకు అంగీకరించింది. ఆ సాధువును పూజామందిరంలోకి తీసుకు వెళ్లి ఆయన పరిస్థితిని స్వామికి వివరించింది. ఆయనకి శాపవిమోచనం కలిగించే శక్తిని తనకి ప్రసాదించమంటూ ప్రార్ధించింది. పరమేశ్వరుడిని స్మరించి ఆ సాధువు తలపై చేయి ఉంచింది. తక్షణమే ఆ సాధువు పసికందుగా మారిపోయాడు.

పార్వతి ఆ బిడ్డకి కడుపునిండుగా పాలు ఇచ్చింది. ఆ తరువాత ఆ బిడ్డపై చేయి వుంచగానే సాధువుగా పూర్వ రూపం వచ్చింది. తనకి శాపవిమోచనం కలిగించిన ఆమెకి ఆ సాధువు కృతజ్ఞతా పూర్వకంగా నమస్కరించి వెళ్లిపోయాడు. ఈ సంఘటన ద్వారా పాతివ్రత్య మహిమ ఎంతటిదో మరోమారు లోకానికి తెలిసింది.

More Bhakti Articles