దీపారాధన ఎప్పుడు చేయాలి?

దీపారాధన ఎప్పుడు చేయాలి?
భగవంతుడు నిరాకారుడు ... కోరుకున్న రూపాల్లో ఆయన కనిపిస్తాడు ... ఆశించిన స్థాయిలో అనుగ్రహిస్తాడు. భక్తుడికి ఏకాగ్రతను కల్పించడం కోసమే భగవంతుడు అనేక రూపాల్లో దర్శనమిస్తూ ఉంటాడు. అలాంటి దైవాన్ని అంతా ఎంతో భక్తి శ్రద్ధలతో పూజిస్తూ వుంటారు. కొంతమంది దేవాలయాలకి వెళ్లి దైవదర్శనం చేసుకుంటే ... మరికొంత మంది ఇంట్లోనే దైవానికి నిత్య దీపారాధన చేస్తుంటారు.

ఇక తమ స్థాయిని బట్టి కొందరు ప్రత్యేకంగా పూజ గదిని ఏర్పాటు చేసుకుంటే, మరికొంత మంది పూజా మందిరాలను ఏర్పాటు చేసుకుంటారు. ఇక ఈ పూజ గదులలోను ... పూజా మందిరాలలోను తప్పనిసరిగా దీపారాధన చేస్తూ, దైవానికి ఇష్టమైన నైవేద్యాలను సమర్పిస్తుంటారు. అయితే పూజగది వున్న వాళ్లలో కొందరు ఆ గదికి ... ఇంటికి ఎలాంటి సంబంధం లేదన్నట్టుగా వ్యవహరిస్తుంటారు.

ఈ కారణంగా ఉదయాన్నే పూజగది మాత్రమే శుభ్రం చేసి దీపారాధన చేస్తారు. ఆ తరువాత మిగతా గదులను చీపురుతో తుడిచి వాకిట్లో ముగ్గు పెడుతూ వుంటారు. ఇక పూజా మందిరాలు వున్నవారిలో కూడా కొందరు ఆ గది వరకూ మాత్రమే వూడ్చి దీపారాధన చేస్తుంటారు. ఈ విధంగా చేయడం వలన పుణ్యం రాకపోగా పాపాన్ని మూటగట్టుకున్నట్టు అవుతుందని శాస్త్రం చెబుతోంది.

పూజ చేసుకోవడానికి ముందే, శుభ్రంగా స్నానం చేసి ... ఇల్లు తుడిచి ... వాకిట్లో ముగ్గు పెట్టాలి. ఆ తరువాత పూజగదిలో ముందురోజు ఉంచిన పూవులను తీసివేయాలి. ఇంటి ముందు ... ఇతర గదుల్లోను ఒకసారి పసుపునీళ్లు చిలకరించి, శుభ్రంగా తోమిన దీపపు కుందులలో ఆవునెయ్యి నింపాలి. ఆత్మ - పరమాత్మ సంకేతంగా రెండు వత్తులను వేసి జ్యోతిని వెలిగించాలి.

అలా వెలిగించిన దీపానికి ముందుగా కుంకుమ బొట్టు పెట్టాలి. ఆ తరువాతే పూజను ప్రారంభించాలి. వయసుపైబడి శరీరం సహకరించనప్పుడు ... అనారోగ్యంతో బాధపడుతున్నప్పుడు మాత్రమే తప్ప, ఈ నియమాన్ని అంతా పాటించాలని శాస్త్రం స్పష్టం చేస్తోంది. శాస్త్రాన్ని అనుసరించాలి ... అది చేసిన సూచనలను ఆచరించాలి. అంతేకానీ ఆ సూచనలను ఎవరికివారు తమకి అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నించకూడదనే విషయాన్ని మరిచిపోకూడదు.

More Bhakti Articles