గోదాదేవి

గోదాదేవి
గోదాదేవి అనే పేరు వినగానే ఆమె విష్ణుమూర్తిని అభిమానించిన తీరు ... ఆరాధించిన తీరు ... పరిణయమాడిన తీరు దృశ్య మాలికగా కనులముందు సాక్షాత్కరిస్తుంది. శ్రీమహా విష్ణువును స్తుతిస్తూ అత్యంత భక్తి శ్రద్ధలతో ఆమె రచించిన 'పాశురాలు' ధనుర్మాస సమయంలో ప్రతి ఆలయంలోను మారుమోగుతూ మంత్రముగ్ధులను చేస్తుంటాయి. కారణ జన్మురాలైన గోదాదేవి ... శ్రీమహావిష్ణువు మనసు గెలుచుకున్న తీరు, ప్రతి మనసుని అలరిస్తుంది ... ఆకట్టుకుంటుంది.

శ్రీ విల్లిపుత్తూరు అనే ఊళ్లో విష్ణుచిత్తుడు అనే విష్ణు భక్తుడు ఉండేవాడు. అనునిత్యం ఆయన పూలను మాలగా కట్టి, ఆలయంలో కొలువుదీరిన విష్ణుమూర్తిని అలంకరించేవాడు. పూలకోసం విష్ణుచిత్తుడు పెంచిన తోటలో ఆయనకి ఒక ఆడశిశువు దొరికింది. ఆ శిశువుకి 'గోద' (మాల) అని నామకరణం చేసి అల్లారుముద్దుగా పెంచి పెద్దచేశాడు. విష్ణుచిత్తుడి పెంపకం కారణంగా ఆమెకి విష్ణుమూర్తి పట్ల అపారమైన భక్తి శ్రద్ధలు ఏర్పడ్డాయి. ఇక పూలను మాలగా కట్టడంలో ఎవరైనా ఆమె తరువాతనే అనిపించుకుంది.

విష్ణుచిత్తుడు ప్రతిరోజు ఆలయానికి వెళుతూ ఆమె కట్టిన పూల మాలను తీసుకివెళ్లి విష్ణుమూర్తికి అలంకరించేవాడు. ఒకరోజున ఆయన పూలమాలను భగవంతుడి మెడలో వేస్తూ .. ఆ మాలకు పొడవైన కేశము వుండటం చూసి ఆలోచనలో పడ్డాడు. ఆ విషయాన్ని గురించి గోదాదేవిని ప్రశ్నించగా, తాను కట్టిన ప్రతి మాలను ముందుగా తాను ధరించి, ఆ వెంటనే దానిని ఆయనకి ఇస్తున్నట్టుగా చెప్పింది.

అపరాధము జరిగిపోయిందంటూ విష్ణుచిత్తుడు ఆమె పట్ల అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఇకపై అలా చేయవద్దని సున్నితంగా మందలించాడు. ఆ రోజు నుంచి ఆమె కట్టిన పూలమాలను కట్టినట్టుగానే స్వామివారికి సమర్పించేది. అలాంటి పరిస్థితుల్లో ఒక రోజున స్వామివారు విష్ణుచిత్తుడికి కలలో కనిపించి, గోదాదేవి ధరించిన మాలను ధరించడమే తనకి ఆనందమనీ, ఇకపై కూడా అలాగే చేయనీయమని చెప్పాడు.

దాంతో గోదాదేవి సాధారణమైన కన్య కాదనే విషయం విష్ణుచిత్తుడికి తెలిసిపోయింది. ఆమె తన కూతురు కాదనీ ... తన 'ఆండాళ్' (తల్లి) అని గ్రహించాడు. ఆయన ద్వారా విషయం తెలుసుకున్న గోదాదేవి సంతోషంతో పొంగిపోయింది. విష్ణుమూర్తినే భర్తగా పొందాలని నిర్ణయించుకుంది. 'తిరుప్పావై'ని రచించి ఆ స్వామి మనసు గెలుచుకుని తాను అనుకున్నది సాధించగలిగింది.

More Bhakti Articles