అష్టలక్షీ ఆలయం

 అష్టలక్షీ ఆలయం
హైదరాబాద్ లో ఉన్నవారిలో 'అష్టలక్ష్మీ ఆలయం' గురించి తెలియనివారు చాలా తక్కువ. అంతగా ఈ ఆలయం తన ప్రత్యేకతను ... విశిష్టతను చాటుకుంటూ ప్రసిద్ధిచెందింది. సాధారణంగా లక్ష్మీదేవి కొలువుదీరిన ఆలయాలకి భక్తుల తాకిడి ఎక్కువగా ఉంటూ వుంటుంది. అలాంటిది తమకి కావలసిన వరాలను ప్రసాదించే అష్టలక్ష్ములు ఒకేచోట నెలవై వుంటే ఇక అక్కడ భక్తుల రద్దీ ఎలా ఉంటుందనేది ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. హైదరాబాదులోని కొత్తపేట - వాసవీ కాలానికి వెళితే ఈ విషయం మనకి స్పష్టంగా అర్థమవుతుంది.

కాలనీవాసులందరి కృషి ఫలితంగానే ఇక్కడ అమ్మవారి ఆలయం నిర్మించబడింది. వారి నిస్వార్ధసేవ కారణంగా ... అమ్మవారి అనుగ్రహం వలన అనతికాలంలోనే ఆలయం అనూహ్యమైన వైభవాన్ని అందుకుంది. విశాలమైన ప్రదేశంలో నిర్మించబడిన ఈ ఆలయం అందమైన ... ఆహ్లాదకరమైన ... ఆధ్యాత్మిక కేంద్రంగా దర్శనమిస్తూ వుంటుంది.

ఆలయ నిర్మాణం శైలి ... అలంకారప్రాయంగా తీర్చిదిద్దిన మందిరాలు ... కుదురుగా కనువిందుగా మలచబడిన దేవతా ప్రతిమలు భక్తులకు నయనానందాన్ని కలిగిస్తూ వుంటాయి. పవిత్రతకు ప్రతీకగా కనిపించే ఈ క్షేత్రంలో ఆలయం రెండు అంతస్తులను కలిగి వుంటుంది. పై అంతస్తులోని గర్భాలయంలో శ్రీమన్నారాయణుడితో కలిసి ఆదిలక్ష్మీ దేవి దర్శనమిస్తూ వుంటుంది. సుందరమూ .. సుకుమారము .. మనోహరము అయిన ఈ మూలమూర్తుల నుంచి దృష్టి మరల్చుకోవడం కష్టసాధ్యంగానే అనిపిస్తుంది.

ఇక ఆపక్కనే లక్ష్మీదేవి రూపాలకి చెందిన ధనలక్ష్మి .. ధాన్యలక్ష్మి .. ధైర్యలక్ష్మి .. విద్యాలక్ష్మి .. విజయలక్ష్మి .. గజలక్ష్మి .. సంతానలక్ష్మి అమ్మవార్ల మందిరాలు వరుసగా కొలువుదీరి కనిపిస్తూ వుంటాయి. ఇక ఈ అష్టలక్ష్ములలో ఏ అమ్మవారి అనుగ్రహం కావలసిన వారు ఆ అమ్మవారికి పూజాభిషేకాలు జరిపించ వచ్చు.

అష్ట లక్ష్ములలో ఏ ఒక్క అమ్మవారిని పూజించినా అది మిగతా అమ్మవార్ల అనుగ్రహాన్ని కూడా సంపాదించి పెడుతుందని పురాణాలు చెబుతున్నాయి. అమ్మవారికి శుక్రవారం అంటే ప్రీతీ కనుక ఈ రోజున ఈ ఆలయం భక్తులతో సందడిగా కనిపిస్తూ వుంటుంది. పర్వదినాల్లో భక్తుల తాకిడి ఎక్కువగా వుంటుంది. వైశాఖ మాసంలో అమ్మవారికి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరుగుతూ వుంటాయి. ఆ సందర్భంగా వివిధ రకాల వాహనాలపై జరిగే విశిష్టమైన సేవలను చూసితీరవలసిందే.

More Bhakti Articles