ఊడిపూడి

ఊడిపూడి
శ్రీ లక్ష్మీనారసింహస్వామి ఆవిర్భవించిన క్షేత్రాలలో 'పంచనారసింహ క్షేత్రాలు' మరింత విశిష్టమైనవిగా చెప్పబడుతున్నాయి. మహిమాన్వితమైన ఆ పంచనారసింహ క్షేత్రాలలో ఒకటిగా 'ఊడిపూడి' గ్రామం దర్శనమిస్తుంది. తూర్పు గోదావరి జిల్లా పి.గన్నవరం మండల పరిధిలో ఈ క్షేత్రం అలరారుతోంది.

అంతర్వేది గోదావరి ఈ గ్రామానికి అత్యంత సమీపంగా ప్రవహిస్తూ వుంటుంది. గోదావరిని ఆనుకుని పంటకాలువ పరుగులుతీస్తూ వుంటుంది. ఈ పంటకాలువ ఒడ్డున వరుసగా ఎన్నోగ్రామాలు కనిపిస్తూ వుంటాయి. ఈ పంటకాలువ నుంచి తెచ్చిన నీటితోనే ఇక్కడి లక్ష్మీనరసింహ స్వామికి అభిషేకాలు జరుగుతుంటాయి. స్వామివారి పాదాలను అభిషేకించడానికి అన్నట్టుగా ఒక్కోసారి గోదావరి ఆలయం వరకూ వస్తుంది.

పచ్చని చెట్ల మధ్య ... ప్రశాంతమైన వాతావరణంలో ఈ ఆలయం నెలవై వుంటుంది. వందల సంవత్సరాల చరిత్ర కలిగిన ఇక్కడి ఆలయంలో స్వయంభువుగా ఆవిర్భవించిన లక్ష్మీ నారసింహుడు భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. ఇక ఇక్కడ స్వామి ఆవిర్భవించిన తీరు ఆయన మహాత్మ్యాన్ని ఆవిష్కరిస్తూ వుంటుంది. పూర్వం ఒక మహా సర్పం ఈ ప్రదేశంలో అదే పనిగా ప్రదక్షిణలు చేస్తూ ఉండటం గ్రామస్తులంతా ప్రత్యక్షంగా చూశారు. అది దేవతా సర్పమని గ్రహించిన గ్రామస్తులు నమస్కరించడంతో అక్కడి నుంచి వెళ్లిపోయింది.

సర్పరాజం ఆ విధంగా ప్రవర్తించడం వెనుక ఏదో కారణముంటుందని గ్రహించిన స్థానికులు ఆ ప్రదేశాన్ని పరిశీలించి చూశారు. అప్పుడు అక్కడ వారికి శ్రీ లక్ష్మీ సమేత నృసింహస్వామి ప్రతిమ కనిపించింది. ఈ విషయం తెలుసుకున్న 'పెదపూడి' జమీందారు స్వామివారికి అక్కడే ఆలయాన్ని నిర్మించాడు. ఆ రోజు నుంచి స్వామివారికి నిత్య పూజలు నిర్వహిస్తున్నారు.

ఆలయ ప్రాంగణంలో జ్వాలా నారసింహుడు ... హనుమంతుడు ... వేణుగోపాలుడు కొలువైవుంటారు. లక్ష్మీ నారసింహుడిని పూజించడం వలన అనారోగ్యాలు తొలగి, ఆయురారోగ్యాలు ... అష్టైశ్వర్యాలు కలుగుతాయని భక్తులు చెబుతుంటారు. భీష్మ ఏకాదశిని పురస్కరించుకుని ఇక్కడి స్వామి వారికి ఘనంగా ఉత్సవాలు నిర్వహించబడుతుంటాయి. ఈ సందర్భంగా చుట్టుపక్కల గ్రామాల వారు సైతం లక్ష్మీ నారసింహుడిని దర్శించుకుని, ఆయన కృపాకటాక్షలకు పాత్రులవుతుంటారు.

More Bhakti Articles