నైవేద్యం ఆరగించిన కృష్ణుడు !

నైవేద్యం ఆరగించిన కృష్ణుడు !
శ్రీ రాఘవేంద్ర స్వామి పూర్వ నామం వేంకటనాథుడు. ఆయన కారణజన్ముడు అనే విషయాన్ని స్పష్టం చేసే సంఘటన ఒకటి ఆయన బాల్యంలో జరిగింది. అప్పట్లో వేంకటనాథుడి తండ్రి శ్రీ కృష్ణుడి ఆలయంలో పూజారిగా ఉండేవాడు. ఒక రోజున ఆయనకి వంట్లో కాస్త నలతగా ఉండటంతో, తనకి బదులుగా బాలుడైన వేంకటనాథుడిని ఆలయానికి వెళ్లమని చెప్పాడు.

స్వామికి నైవేద్యంగా సమర్పించినదే ఆయన తల్లి ప్రసాదంగా స్వీకరిస్తుందనీ, దానిని జాగ్రత్తగా తీసుకురమ్మని చెప్పి మరీ పంపించాడు. గర్భాలయంలో కృష్ణుడి విగ్రహం ముందు నైవేద్యాన్ని వుంచి ఆరగించవలసిందిగా కోరాడు వేంకటనాథుడు. దాంతో వెంటనే అక్కడ బాలకృష్ణుడు ప్రత్యక్షమై, ఆ నైవేద్యాన్ని ఇష్టంగా ఆరగించి అదృశ్యమయ్యాడు.

ఖాళీ పాత్రతో ఇంటికి తిరిగి వచ్చిన వేంకటనాథుడిని నైవేద్యం గురించి అడిగాడు తండ్రి. కృష్ణుడు తినేశాడని చెప్పేశాడు వేంకటనాథుడు. ఆయన అబద్ధం చెబుతున్నాడని భావించిన తండ్రి ఆగ్రహావేశాలకు లోనయ్యాడు. ఎంతోకాలంగా శ్రీ కృష్ణుడి సేవ చేస్తోన్న తనకే ఆయన దర్శన భాగ్యం లభించలేదంటూ, వేంకటనాథుడిని దండించబోగా తల్లి అడ్డుపడింది.

తండ్రి ఎన్ని విధాలుగా అడిగినా వేంకటనాథుడు జరిగినదే చెబుతూ వచ్చాడు. ఆ మాటలు నమ్మని తండ్రి గుంజిళ్లు తీయమని ఆదేశించాడు. గుంజీళ్లు తీస్తోన్న వేంకటనాథుడిలో ఆయనకి బాలకృష్ణుడు కనిపించాడు. అంతే తన అజ్ఞానాన్ని మన్నించమంటూ పాదాలపై పడ్డాడు. ఇలాంటి సంఘటనలు ఎన్నో శ్రీ రాఘవేంద్రులవారు ఒక సాధారణమైన వ్యక్తికాడనే విషయాన్ని ఆయన బాల్యం నుంచే నిరూపిస్తూ వచ్చాయి.

More Bhakti Articles