బంగారు ఉసిరికాయలు!

బంగారు ఉసిరికాయలు!
సాక్షాత్తు కైలాసనాథుడైన శివుడే భూలోకాన ఆదిశంకరుడై అవతరించాడు. ఆయన పాద స్పర్శచే పుణ్య క్షేత్రాలు సైతం మరింత పునీతమయ్యాయి ... ఆయన చూపు సోకిన జీవితాలు చరితార్థమయ్యాయి. ఈ కారణంగానే అంతా ఆయనను శంకరభగవత్పాదులు అని పిలిచేవారు. అలాంటి శంకరులు బాల్యం నుంచే అనేక మహిమలు చూపేవాడు. ఒకసారి ఆయన ఓ పేదరాలి ఇంటికి భిక్షకి వెళ్లాడు. ఆమె ఒక ఉసిరికాయ తీసుకువచ్చి ఆయన భిక్షా పాత్రలో వేసింది. అది చూసిన శంకరులు ఆశ్చర్యపోయాడు.

శంకరుల భావాన్ని అర్థం చేసుకున్న ఆ స్త్రీ ... తన ఇంట్లో ఆ ఉసిరికాయ మినహా మరేమీ లేదన్నట్టుగా చూసింది.ఆమె ఎంతటి దయనీయమైన పరిస్థితుల్లో వుందనేది ఆయన గ్రహించాడు. ఎంతో కాలంగా దారిద్ర్యంతో బాధపడుతున్నప్పటికీ ఏవీలేదని చెప్పకుండా, ఏదో ఒకటి దానం చేయాలనే ఆమె ఆరాటం ఆయనని కదిలించి వేసింది. పూర్వ జన్మలో ఆమె ఎవరికీ ఎలాంటి దానధర్మాలు చేయకపోవడం వల్లనే ఇలాంటి పరిస్థితి వచ్చిందనే విషయం ఆయనకి అర్థమైపోయింది.

కానీ ఈ రోజున ఆమె తనకి ఉసిరికాయ దానం చేసింది కనుక, అందుకు ఫలితంగా ఆమెకి సంపదలను ప్రసాదించాలని అనుకున్నాడు. అందుకు లక్ష్మీదేవి అనుగ్రహం అవసరం కనుక, ఆ వాకిట్లోనే నుంచుని ఆయన శ్రీ మహాలక్ష్మీ దేవిని స్మరించాడు. కరుణించ వలసిందిగా అమ్మవారిని 'కనకధారా స్తవం'తో ప్రార్ధించాడు.

అంతే శంకరులవారి భక్తి శ్రద్ధలకు, ఆయన పాండిత్య ప్రతిభకు అమ్మవారి మనసు కరిగిపోయింది. శంకరులవారికి ఉసిరికాయను దానం చేసిన ఆ స్త్రీ ఇంటి వాకిట్లో బంగారు ఉసిరికాయలను కురిపించింది. దాంతో శంకరులవారి పాదాలకు ఆ స్త్రీ నమస్కరించింది. ఆనాటి నుంచి నేటివరకూ సంపదలను కోరే వారు ప్రతి శుక్రవారం 'కనకధారా స్తవం' పఠిస్తూ వస్తున్నారు.

More Bhakti Articles