పాల్వంచ

పాల్వంచ
వైకుంఠం నుంచి దిగివచ్చిన శ్రీమహావిష్ణువు, శ్రీనివాసుడిగా సప్తగిరులను పరమపవిత్రం చేశాడు. అనాథ రక్షకుడిగా ... ఆపద్భాంధవుడిగా ... ఆపదమొక్కులవాడిగా అశేష భక్తజనావళిచే నిత్యనీరాజనాలు అందుకుంటున్నాడు. తన భక్తులను అనుగ్రహించడం కోసం స్వామి, అనేక ప్రాంతాల్లో కొలువుదీరాడు. వాటిలో ఒకటిగా మనకి ఖమ్మం జిల్లా పాల్వంచ కూడా కనిపిస్తుంది.

సహజంగానే శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయాలు ఎక్కువగా కొండలపైనే కొలువుదీరి కనిపిస్తుంటాయి. అలాగే ఇక్కడ కూడా శ్రీవేంకటేశ్వర స్వామి ఆలయం కొండపై దర్శనమిస్తూ వుంటుంది. ఆహ్లాదకరమైన వాతావరణంలో కొండపై అందంగా నిర్మించబడిన ఈ ఆలయం, దూరం నుంచే కనిపిస్తూ మనసులోని భక్తి భావాలను తట్టిలేపుతూ వుంటుంది. పచ్చదనంతో నిండిన కొండపై తెల్లని వర్ణంలో వెలిగిపోయే ఈ ఆలయం, సరోవరంలో తేలే హంసను గుర్తుకుతెస్తుంది.

విశాలమైన ప్రాంగణం ... పొడవైన ప్రాకారాలు కలిగిన ఈ ఆలయంలో, అడుగడుగునా పవిత్రత ప్రతిబింబిస్తూ వుంటుంది. గర్భాలయంలో స్వామివారు తొమ్మిది అడుగుల ఎత్తులో సుందరంగా ... సుమనోహరంగా దర్శనమిస్తూ ఉంటాడు. స్వామివారిపై నుంచి దృష్టిని ... మనసుని మళ్లించడం కష్టసాధ్యమనిపిస్తుంది. సమస్త లోకాలను పరమ పునీతంచేసే అందమైన ఆ పాదాలను వదలకుండా ... కదలకుండా అక్కడే కూర్చోవాలనిపిస్తుంది.

గర్భాలయానికి రెండు వైపులా శ్రీదేవి - భూదేవి మందిరాలు నెలకొని వుంటాయి. ప్రతి శనివారం స్వామివారికి ప్రత్యేక పూజలు ... విశేష అలంకారాలు చేస్తుంటారు. పర్వదినాల సమయంలో స్వామివారి వైభవం చూసి తీరవలసిందే. స్వామివారిని దర్శించిన భక్తులు వారి వారి భావాలకు ... భక్తి శ్రద్ధలకు తగిన విధంగా ఫలితాలను పొందుతూ వుంటారు.

More Bhakti Articles