మహాశివుడి మందిరం

మహాశివుడి మందిరం
తలచినంతనే ... కొలిచినంతనే భక్తుల ఎదుట ప్రత్యక్షం కావడంలోను, వారు కోరిన వరాలను వెంటనే అనుగ్రహించడంలోను శివుడు ముందుంటాడు. భక్తులకు తేలికగా వశమైపోతాడు కనుకనే ఆయనని అంతా 'భక్తవశంకరుడు'గా పిలుస్తుంటారు. అలాంటి శివుడు సకల సంపదల నుంచి ... సమస్త బంధాలను వదులుకుని సాధించే మోక్షం వరకూ ప్రసాదిస్తుంటాడు. ఆ స్వామి కొలువైన క్షేత్రమే ఖమ్మం జిల్లాలోని అన్నపురెడ్డి పల్లిలో దర్శనమిస్తుంది.

ప్రశాంతమైన వాతావరణంలో విలసిల్లుతోన్న ఈ క్షేత్రంలో స్వామివారు మల్లికార్జునుడుగా ... అమ్మవారు భ్రమరాంబదేవిగా పూజలు అందుకుంటున్నారు. విశాలమైన ప్రదేశంలో జరిగిన ఇక్కడి ఆలయ నిర్మాణం చూపరులను కట్టి పడేస్తుంది. అడుగడుగునా ఆధ్యాత్మిక పరిమళాలు వెదజల్లుతూ ఆహ్వానం పలుకుతుంటుంది. ఆలయ ప్రాకారానికి ముందున మధ్య భాగంలో శివపార్వతులు దర్శనమిస్తూ వుంటారు. ఇక ఒకవైపున స్వామికి కన్నును అర్పిస్తూ 'కన్నప్ప' ... మరో వైపున శివలింగాన్ని కౌగిలించుకున్న 'మార్కండేయుడు' కనిపిస్తుంటారు.

భారీగా తీర్చిదిద్దిన ఈ విగ్రహాలు అందంగా ... ఆధ్యాత్మిక భావాలు పెంచేవిగా అనిపిస్తుంటాయి. ప్రాకారాన్ని దాటి లోపల అడుగుపెట్టిన భక్తులకు ముందుగా గణపతి దర్శనమిస్తాడు. ఆ స్వామికి భక్తి శ్రద్ధలతో నమస్కరించిన భక్తులు ప్రధాన ముఖమంటపానికి చేరుకుంటారు. గర్భాలయంలో స్వామివారు లింగరూపంలో కొలువై కనిపిస్తుంటాడు. మల్లికార్జునస్వామికి భక్తులు మనసారా పూజాభిషేకాలు జరిపిస్తారు. అలాగే అమ్మవారికి కుంకుమ పూజలు చేయిస్తారు.

ఇక్కడి శివయ్య చాలా తేలికగా ప్రసన్నుడవుతాడనీ, సమస్త బాధల నుంచి విముక్తిని కలిగిస్తాడని భక్తులు అనుభవ పూర్వకంగా చెబుతుంటారు. ఈ కారణంగానే ప్రతి ఒక్కరూ ఆ స్వామికి ఎలాంటి లోటు రానీయకుండా చూసుకుంటూ వుంటారు. పర్వదినాల సమయాల్లో ఆ స్వామి సేవకు మరికొంత సమయాన్ని కేటాయిస్తుంటారు.

More Bhakti Articles