విశిష్ట సర్ప క్షేత్రం

విశిష్ట సర్ప క్షేత్రం
నాగదేవతను ఆరాధించే సంప్రదాయం ప్రాచీనకాలం నుంచి వస్తోంది. నాగదేవతను పూజించడం వలన నాగదోషాలు తొలగిపోతాయనీ ... సంతాన సౌభాగ్యాలు కలుగుతాయని పురాణాలు చెబుతున్నాయి. నాగదేవతను ఆరాధించడం వలన పాడిపంటలు వృద్ధి చెందుతాయని అంటారు. నాగుపాము పుట్టమట్టిని ధరించడం వలన చర్మ సంబంధమైన వ్యాధులు తొలగిపోతాయని కూడా నిరూపించబడింది.

అలాంటి నాగదేవత సుబ్రహ్మణ్య స్వామి అంశావతారంగా చెప్పబడింది. అందువలన నాగదేవత క్షేత్రాలు విశిష్టమైనవిగా ప్రసిద్ధిచెందాయి. అలాంటి క్షేత్రాలలో ఒకటిగా 'రుద్రపాక' దర్శనమిస్తుంది. మహిమాన్వితమైన ఈ క్షేత్రం కృష్ణా జిల్లా నందివాడ మండల పరిధిలో నెలవైవుంది. పూర్వం ఈ ప్రాంతానికి చెందిన ఓ రైతుకి తన పొలంలో మహా తేజస్సుతో వెలిగిపోతున్న నాగుపాము కనిపించిందట. ఆయన మాట మేరకు అక్కడి పనివాళ్లు ఆ సర్పాన్ని చంపేశారు.

ఆ క్షణంలోనే ఆ సర్పం ఛాయారూపంలో ప్రత్యక్షమై, తనకి శాప విమోచనం కలిగించినందుకు కృతజ్ఞతలు తెలిపింది. ఈ ప్రదేశంలో తనకి ఆలయాన్ని నిర్మించి, ఎదురుగా ఒక చెరువును తవ్వించమని కోరింది. ఊహించని ఈ సంఘటనకి రైతు ఆశ్చర్యపోయాడు. ఆ తరువాత చెరువును తవ్వించి, దాని ఒడ్డున శ్రీ వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్య స్వామి ఆలయాన్ని నిర్మించి విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు. ఆ రోజు నుంచి ఇక్కడి నాగదేవతను భక్తులు 'శ్రీ వల్లీ దేవసేన సమేత నాగ సుబ్రహ్మణ్య స్వామి'గా పూజిస్తున్నారు.

ఇక్కడ సహజ సిద్ధంగా ఏర్పడిన పుట్టలో 11 వారాల పాటు పాలు పోసి, ప్రదక్షిణలు చేసిన వారి మనోభిష్టాలు నెరవేరతాయని భక్తులు విశ్వసిస్తూ వుంటారు. గర్భాలయంలోని స్వామివారికి ఎదురుగా నెమలి వాహనం కొలువై వుంటుంది. 'సుబ్రహ్మణ్య షష్ఠి' రోజున స్వామివారికి కళ్యాణ మహోత్సవం నిర్వహిస్తూ వుంటారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు, స్వామివారిని దర్శించుకుని మొక్కుబడులు చెల్లించుకుంటూ వుంటారు.

More Bhakti Articles