దేవతా వృక్షాలు తొలగించ వచ్చా?

దేవతా వృక్షాలు తొలగించ వచ్చా?
రావి ... మారేడు .. ఉసిరి ... వేపచెట్లు దేవతా వృక్షాలుగా చెప్పబడ్డాయి. ఈ చెట్లలో రావి ... మారేడు ... ఆలయ ప్రాంగణంలో ఎక్కువగా కనిపిస్తూ వుంటాయి. ఇక ఉసిరి ... వేప చెట్లు అటు ఆలయాలలోను ... ఇటు ఇళ్లలోనూ ఎక్కువగానే కనిపిస్తూ వుంటాయి. రావి చెట్టును శ్రీమన్నారాయణుడిగా ... వేపచెట్టును లక్ష్మీదేవిగా భావించి పూజించే సంప్రదాయం మనకి అనాదిగా వస్తోంది.

సాధారణంగా ఇంటి ఆవరణలో కనిపించే వేప - ఉసిరి చెట్లను ఆ ఇంటి వారు ఏ కారణంగానైనా అడ్డుగా భావిస్తే, వెంటనే వాటిని కొట్టివేయించడం చేస్తుంటారు. దేవతా వృక్షాలను ఈ విధంగా కొట్టివేయడం వలన దోషాన్ని మూటగట్టుకున్నట్టు అవుతుందని శాస్త్రం చెబుతోంది. ఇంటి ఆవరణలోగల దేవతా వృక్షాలను తొలగించడం తప్పనిసరి అయితే, ముందుగా శాంతి చేయించాలని అంటోంది. దేవతా వృక్షాలను తొలగించడానికి మాసంతో పాటు తిథి .. వార .. నక్షత్రాలను బట్టి ముహూర్తాన్ని నిర్ణయించవలసి వుంటుంది.

ఆ ముహూర్తాన్ని పండితుల ద్వారా తెలుసుకుని అప్పుడు మాత్రమే ఆ వృక్షాలను తొలగించడానికి సిద్ధపడాలని శాస్త్రం సూచిస్తోంది. ఈ నియమాలు పాటించాంకదా అని దేవతా వృక్షాలను చక చకా గొడ్డలితో కొట్టి అవతల పడేయడం చేయకూడదు. సున్నితంగా ...ఆ వృక్షాలను గాయపరచకుండా తొలగించాలి. లేదంటే ఆ వృక్షాలకి సంబంధించిన దైవాల ఆగ్రహానికి గురికావలసి ఉంటుందనే విషయాన్ని శాస్త్రం స్పష్టం చేస్తోంది.

More Bhakti Articles