శుభ శకునం

శుభ శకునం
సాధారణంగా ఏదైనా ఓ పనిమీద బయటికి వెళుతున్నప్పుడు మంచి శకునం చూసుకుని బయలుదేరుతుండటమనేది ప్రాచీనకాలం నుంచి వస్తోంది. మంచి శకునం వలన కార్యసిద్ధి జరుగుతుందనీ, లేదంటే కార్యహాని కలుగుతుందనే విషయాన్ని తరతరాలుగా విశ్వసించడం జరుగుతోంది. అయితే ఏది మంచి శకునమో ... ఏది కాదో తెలియక చాలామంది తికమకపడిపోతుంటారు.

పనిమీద బయటికి వెళుతున్నప్పుడు ... ముఖ్యంగా శుభకార్యాల నిమిత్తం ప్రయాణమైనప్పుడు కొన్ని శకునాలను తప్పకుండా పట్టించుకోవాలని శకున శాస్త్రం చెబుతోంది. గాడిద అరుపు వినిపించడం వలన శుభం ... అది కనిపించడం వలన కీడు జరుగుతాయి. అలాగే నక్క అరుపు వినిపించడం వలన కీడు ... అది కనిపించడం వలన శుభం కలుగుతాయి. ఇక గరుడ పక్షి కనిపించినా ... దాని అరుపు వినిపించినా శుభం చేకూరుతుంది. అయితే గద్ద కనిపించినా ... దాని అరుపు వినిపించినా ప్రయాణం వాయిదా వేసుకోమని శాస్త్రం చెబుతోంది.

ఇక ఈ నేపథ్యంలో చాలా మంది మంచి శకునాన్ని ఏర్పాటు చేసుకుని మరీ తమ కార్యాలకు శ్రీకారం చుడుతుంటారు. మరికొందరు తమ భార్యా పిల్లలను ఎదురు రమ్మని చెప్పి బయలుదేరుతుంటారు. ఇలాంటి పద్ధతి కావలసిన ప్రయోజనాన్ని ఇవ్వదని పెద్దలు చెబుతున్నారు. శకునం అనేది తలపెట్టిన కార్యం అవుతుందా లేదా అనేది తెలియజేస్తుందనీ, అది సహజంగా జరగాలని అంటున్నారు. మంచి శకునాన్ని ఏర్పాటు చేసుకుని కార్యాలను ప్రారంభించడం వలన, సంతృప్తి కలుగుతుందే తప్ప సరైన ఫలితం మాత్రం రాదనే విషయాన్ని స్పష్టం చేస్తున్నారు.

More Bhakti Articles