రంగనాథ క్షేత్రం

రంగనాథ క్షేత్రం
రంగనాథస్వామి ఆవిర్భవించిన అతి ప్రాచీనమైన పుణ్యక్షేత్రాలలో 'సొలస' రంగనాథస్వామి క్షేత్రం ముందువరుసలో కనిపిస్తుంది. గుంటూరు జిల్లాలో విలసిల్లుతోన్న ఈ క్షేత్రం, ఒకప్పుడు 'రంగపట్టణం' పేరుతో వెలుగొందింది. కొండవీటి రెడ్డిరాజులలో ఒకరైన రంగాపతిరావు పేరున ఈ గ్రామం ఏర్పడిందనీ, ఆయనే ఇక్కడ రంగనాథస్వామి ఆలయాన్ని నిర్మించాడని ఆధారాలు చెబుతున్నాయి.

ఇక ఇక్కడి గ్రామస్తుల పూర్వీకులు 'వలస' వచ్చి ఇక్కడ వుండటం వలన ఈ గ్రామానికి 'వలస' అనే పేరు వచ్చిందనీ, కాలక్రమంలో అది 'సొలస'గా మార్పు చెందిందని అంటారు. నాటి ప్రజలు స్వామివారిని తమ ఇలవేల్పుగా పూజించారు. అయితే కాలక్రమంలో మతపరమైన దాడులకు కొందరు సిద్ధపడగా, స్వామివారి విగ్రహాన్ని స్థానికులు ఒక పొలంలో దాచి ఉంచారు. అలా కొన్ని సంవత్సరాల పాటు పూజాభిషేకాలకు దూరంగా వున్న స్వామివారి విగ్రహం, ఆ తరువాత ఒక రైతు పొలం దున్నుతుండగా బయటపడింది.

గ్రామస్తులంతా కలిసి ఆ విగ్రహాన్ని పునఃప్రతిష్ఠించారు. నాటి నుంచి స్వామివారికి నిత్య పూజలు ... మాసోత్సవాలు ... వార్షికోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. గర్భాలయంలో స్వామివారు ఆదిశేషుడి పై శయనిస్తూ వుండగా, ఆయన పాదసేవలో శ్రీదేవి - భూదేవి నిమగ్నమై వుంటారు. దర్శనమాత్రంచేతనే ఇక్కడి స్వామి అమూల్యమైన వరాలను ప్రసాదిస్తాడనీ, అనంతమైన పుణ్యఫలాలను అందిస్తాడని స్థానికులు చెబుతుంటారు.

ఇక ఈ క్షేత్రానికి వినాయకుడు క్షేత్ర పాలకుడిగా వ్యవహరిస్తూ వుండటం విశేషం. వైశాఖ మాసంలో స్వామివారికి అత్యంత వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతుంటాయి. ధనుర్మాసంలో తిరుప్పావై నిర్వహిస్తూ వుంటారు. ఇక భోగి పండుగ రోజున అంగరంగవైభవంగా జరిగే గోదాదేవి రంగనాయకుల కల్యాణోత్సవం చూసి తీరవలసిందే.

More Bhakti Articles