ఆది కుంభేశ్వర ఆలయం

ఆది కుంభేశ్వర ఆలయం
మహా శివుడు మహాలింగరూపంలో అనేక ప్రాంతాల్లో అవతరించాడు. అలా ఆయన ఆవిర్భవించిన ప్రతిక్షేత్రంలోను ఏదో ఒక ప్రత్యేకత కనిపిస్తూనే వుంటుంది ... ఆ ఆవిర్భావం వెనుక ఏదో ఒక ఆసక్తికరమైన కథ వినిపిస్తూనే వుంటుంది. అనేక క్షేత్రాలలో దర్శనమిచ్చే శివలింగాలను చాలా మంది చూసి వుంటారు. అందుకు భిన్నంగా ఏ శివలింగం కనిపించినా అది తప్పక ఆశ్చర్యచకితులను చేస్తుంది. అలా విస్మయానికి గురిచేసే శైవ క్షేత్రం మనకి 'కుంభకోణం'లో దర్శనమిస్తుంది.

ఇక్కడ శివలింగం కుంభాకారంలో కొలువై వుంటుంది. ఈ ప్రాంతానికి కుంభకోణం అనే పేరు రావడానికి కారణం కూడా ఇదే. సదాశివుడు ఈ క్షేత్రంలో ఆవిర్భవించడానికి వెనుక గల కథను పరిశీలిస్తే, పూర్వం ఒక మహాప్రళయానికి సమయం ఆసన్నం కావడంతో, మహాశివుడిని బ్రహ్మదేవుడు కలుసుకున్నాడు. అమృతభాండంతో పాటు సృష్టి భీజాన్ని శివుడికి అందజేసి వాటిని సంరక్షించవలసిన బాధ్యతత అతనిదేనని చెప్పాడు. దాంతో వాటిని కాపాడుకోవడం కోసం ప్రళయకాలంలో కుండగా మారిన శివుడు, ఈ ప్రదేశానికి కొట్టుకుని వచ్చి ఇక్కడ అదే రూపంలో వెలిశాడని స్థలపురాణం చెబుతోంది.

ఇక్కడ అమ్మవారు 'మంగళాంబికాదేవి' గా పూజలు అందుకుంటోంది. అందంగా తీర్చిదిద్దిన అమ్మవారి ఆలయాన్ని ఎంతసేపైనా అలా చూస్తూనే ఉండాలనిపిస్తుంది. 1300 సంవత్సరాల క్రితం నిర్మించబడిన ఆలయం ఆనాటి నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తుంటుంది. విశాలమైన ప్రాంగణం ... పొడవైన ప్రాకారాలు ... చాలా ఎత్తైన రాజగోపురం ఆలయ వైభవాన్ని నిర్వచిస్తూ కనిపిస్తాయి.

కుంభేశ్వరుడిని దర్శించడం వలన జన్మజన్మల పాపాలు నశించి మోక్షం లభిస్తుందని అంటారు. ప్రతి 12 సంవత్సరాలకు ఒకసారి జరిగే మహామాఘ ఉత్సవాలకి భక్తలు లక్షల సంఖ్యలో తరలి వస్తారు. ఇక్కడి పుష్కరిణిలో స్నానమాచరించి ఆది దంపతులను దర్శించుకుంటారు ... అనంతమైన పుణ్యఫలాలను అందిపుచ్చుకుంటారు.

More Bhakti Articles