నూకాంబిక ఆలయం

నూకాంబిక ఆలయం
తల్లి తన బిడ్డల బాగోగులు దగ్గరుండి చూసుకోవాలని అనుకుంటుంది. అందుకోసమే అహర్నిశలూ ఆరాటపడుతుంటుంది. జగజ్జనని అయిన అమ్మవారు కూడా తన బిడ్డలను అనుగ్రహించడం కోసమే వివిధ ప్రాంతాల్లో అంశావతారాల్లో కొలువుదీరింది. అలా అమ్మవారు 'నూకాంబిక' పేరుతో నెలవైన క్షేత్రం మనకి విశాఖ జిల్లాలోని 'అనకాపల్లి'లో దర్శనమిస్తుంది.

జీవులకు నూకలు (ఆహారం) ప్రసాదించే దేవత గనుక అమ్మవారిని నూకాంబికగా ... నూకాలమ్మ తల్లిగా భక్తులు కొలుస్తుంటారు. ఇక్కడి అమ్మవారు పురాణాల్లో 'అనఘాదేవి' పేరుతో కనిపిస్తుంది. ఈ కారణంగానే అప్పట్లో ఈ ప్రాంతాన్ని అనఘాపురమనీ ... అనఘాపల్లి అని పిలిచేవారు. కాలక్రమంలో అది అనకాపల్లిగా మారిందని అంటారు.

నూకాంబిక ఆలయం చాలా పెద్దది ... వందలాది మంది భక్తులు అమ్మవారిని తీరుబడిగా దర్శించుకునే వీలుంటుంది. ఆలయ ప్రాంగణంలో ఓ వైపున నవదుర్గల ప్రతిమలు ఆకర్షణీయంగా కనిపిస్తాయి. మరో వైపున అమ్మవారి సోదరుడిగా చెప్పబడుతోన్న 'పోతురాజు' పూజలు అందుకుంటూ ఉంటాడు. గర్భాలయంలో అమ్మవారు పసుపు రంగులో ... విశాలమైన నేత్రాలతో ... చక్కని ముక్కెరతో కళకళలాడుతూ కనిపిస్తుంటుంది.

ప్రతి నిత్యం సాయంత్రం వేళ అమ్మవారికి శంఖనాదంతో సమర్పించే 'నక్షత్ర హారతి'కి భక్తులు విశేష సంఖ్యలో హాజరవుతుంటారు. ప్రతి యేటా ఫాల్గుణ బహుళ అమావాస్య రోజున ... ఉగాది సందర్భంగా అమ్మవారికి నెలరోజుల పాటు ఉత్సవాలు జరుగుతుంటాయి. ఇక దసరా నవరాత్రి ఉత్సవాలు కూడా కన్నుల పండువగా జరుగుతాయి. ఇలా అమ్మవారి ఆలయం ఎప్పుడు చూసినా నిండుగా ... సందడిగా కనిపిస్తూ వుంటుంది.

అమ్మవారు దర్శన మాత్రం చేతనే సంతాన ... సౌభాగ్యాలను ప్రసాదిస్తుందనీ ... సుఖ సంతోషాలను అనుగ్రహిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు. తమ కోరికలు నెరవేర్చిన అమ్మవారికి ముడుపులు చెల్లిస్తుంటారు.

More Bhakti Articles