శ్రీ పెద్దింటమ్మ క్షేత్రం

శ్రీ పెద్దింటమ్మ క్షేత్రం
శక్తిస్వరూపిణి అయిన పార్వతీదేవి ... తన బిడ్డలను అనుగ్రహించడం కోసం 'పెద్దింటమ్మ' గా కొలువుదీరింది. అమ్మవారు ఆవిర్భవించిన ఈ క్షేత్రం కృష్ణా జిల్లా - కైకలూరు మండలంలోని 'కొల్లేటి'లో విరాజిల్లుతోంది. నూటాఒక్క గ్రామదేవతలలో పెద్దదిగా చెప్పబడుతున్న కారణంగా ఇక్కడి అమ్మవారికి 'పెద్దింటమ్మ' అనే పేరు వచ్చింది.

ఇక్కడి అమ్మవారు సరస్సు మధ్యలో దర్శనమిస్తుంది. క్రీ.శ.11 వ శతాబ్దంలో ఒరిస్సా పాలకుడైన అంబదేవరాయలు అమ్మవారిని ప్రతిష్ఠించినట్టు ఆధారాలు ఉన్నాయి. గర్భాలయంలో అమ్మవారు పద్మాసనంలో త్రిశూల ... డమరుకాలను కలిగివుంటుంది. విశాలమైన త్రినేత్రాలతో ... నాగుపడగల కిరీటంతో దర్శనమిస్తుంది.

ఇక అమ్మవారు ఇక్కడ కొలువై వుండగా ... సమీపంలోని గ్రామంలో గోకర్ణేశ్వరుడిగా శివుడు పూజలు అందుకుంటూ ఉంటాడు. మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా అయ్యవారు అమ్మవారి ఆస్థానానికి వస్తారు. ఈ రోజున వీరికి జరిగే కల్యానోత్సవాన్ని వీక్షించడానికి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తారు. అంగరంగ వైభవంగా ఈ వేడుక జరుగుతుంది.

ఇక ప్రతి సంవత్సరం ఫాల్గుణ శుద్ధ ద్వాదశి నుంచి 16 రోజుల పాటు ఇక్కడ 'జాతర' జరుగుతుంది. ఈ రోజుల్లో వివిధ ప్రాంతాల నుంచి లక్షలాదిగా వచ్చిన భక్తులు అమ్మవారిని దర్శించుకుంటూ వుంటారు ... మొక్కుబడులు చెల్లించి పుణ్యఫలాలు స్వీకరిస్తూ పునీతులవుతుంటారు.

More Bhakti Articles