ఫణిగిరి నారసింహుడు

ఫణిగిరి నారసింహుడు
శ్రీలక్ష్మీనృసింహ స్వామి ఆవిర్భవించిన అతి పురాతనమైన క్షేత్రాలలో 'ఫణిగిరి లక్ష్మీ నృసింహ స్వామి' క్షేత్రం ఒకటి. క్రీ.శ.3వ శతాబ్దంలో వెలుగులోకి వచ్చిన ఈ క్షేత్రం హైదరాబాద్ లోని 'చైతన్య పురి'లో దర్శనమిస్తుంది. ఈ ప్రాంతంలోని కొండ గుహలో శ్రీ లక్ష్మీ నృసింహ స్వామి ఆవిర్భవించాడు.

పూర్వం ఈ ప్రదేశంలో 'ముచికుంద మహర్షి' తపస్సు చేయగా, ఆయన అభ్యర్ధనమేరకు స్వామి ఇక్కడ వెలసినట్టు స్థలపురాణం చెబుతోంది. ఈ కారణంగానే ఇక్కడ ప్రవహించే నదికి 'ముచికుంద' నదిగా పేరు వచ్చిందనీ, కాలక్రమంలో అది 'మూసీనది'గా మార్పు చెందిందని అంటారు. ఈ నది మధ్యలో నేటికీ ఒక మహా శివలింగం ... గంగాభవానీ అమ్మవారు కొలువుదీరి కనిపిస్తుంటారు.

ఇక స్వామివారు వెలసిన బండరాయి సర్పాకారంలో వుండటం వలన ఈ గుట్టకు 'ఫణిగిరి' అనే పేరు వచ్చిందని అంటారు. వేల సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ క్షేత్రం కాలక్రమంలో మరుగున పడిపోయింది. ఆ తరువాత 19 వ శతాబ్దపు తొలినాళ్లలో ఈ ఆలయాన్ని పునఃనిర్మించి నిత్య పూజలు జరుపుతున్నారు. ఇక ఇక్కడి లక్ష్మీనృసింహ స్వామి వారిని భక్తులు తమ ఇలవేల్పుగా భావిస్తుంటారు. ఆయన ఆశీస్సులతోనే అన్నిరకాల శుభకార్యాలకు శ్రీకారం చుడుతుంటారు.

పండుగలు ... పర్వదినాల సమయంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారు. ఈ స్వామివారిని దర్శించుకోవడం వలన కుజ దోషం తొలగిపోతుందని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు. భక్తులు ధర్మబద్ధమైన తమ కోరికలు స్వామివారికి చెప్పుకుని ఇక్కడ ముడుపులు కడతారు. ఆ కోరికలు నెరవేరిన తరువాత వచ్చి ఆ ముడుపులను స్వామివారికి చెల్లించుకుంటారు.

More Bhakti Articles