దేవరకోట

దేవరకోట
కలియుగంలో వైభవమంటే శ్రీవేంకటేశ్వర స్వామిదే. ఆ సౌందర్యం ... ఆ సంపద ఆయనకే సొంతం. స్వామివారు సర్వాంగ సుందరంగా ముస్తాబై ... సకల భోగాలను అనుభవిస్తున్నట్టుగా కనిపిస్తుంటాడు. నిజానికి ఆయన ఏమూల నుంచి ఏభక్తుడు ఆర్తితో పిలిచినా ఆ క్షణంలో అక్కడికి పరుగున వెళుతూనే ఉంటాడు.

తన భక్తుల బాధలను తీర్చడం కోసం ఆయన అన్ని వైభవాలను వదులుకోవడానికి సిద్ధంగా ఉంటాడు. తన అలసట భక్తులకి తెలియకుండా చిరునవ్వులు చిందిస్తూనే ఉంటాడు. ఈ వైభవం ... ఈ రాజసం ... ఇదంతా తన భక్తుల ఆనందం కోసమే. భక్తుల మనసు మందిరాల్లోనే స్వామి నిజమైన వైభవాన్ని పొందుతుంటాడు.

ఈ కారణంగానే స్వామి తన దేవేరులతో అనేక ప్రాంతాల్లో ఆవిర్భవించాడు. అలా వెలసిన అతి ప్రాచీనమైన క్షేత్రమే 'దేవరకోట'. ఇది ఆదిలాబాద్ జిల్లా నిర్మల్ సమీపంలో దర్శనమిస్తుంది. ఇక ఈ ఆలయం వెలుగుచూడటం వెనుక ఆసక్తికరమైన కథ ఒకటి వుంది. గోల్కొండ నవాబు తానీషా భద్రాచలంలోని గోపన్నను బంధించే బాధ్యతను నిమ్మలనాయుడు అనే అధికారికి అప్పగించాడు.

ఆయన ఈ ప్రాంతం మీదుగా వెళుతూ వుండగా, ఈ ప్రదేశంలో అడుగు పెట్టగానే ఆయన ఆలోచనా విధానం ఒక్కసారిగా మారిపోయిందట. ఆయనలో సహజసిద్ధంగా వున్న ఆవేశం మటుమాయమై ప్రశాంతత ఆవరించింది. ఒక మహా భక్తుడిని బంధించడానికి బయలుదేరి తప్పు చేస్తున్నానేమో అనే ఆలోచన కలిగింది.

తనని ఆ స్థలం అంతగా ప్రభావితం చేయడానికి కారణమేమిటా అని ఆ ప్రదేశాన్ని పరిశీలించగా, శిధిలావస్థలో గల శ్రీలక్ష్మీ వేంకటేశ్వరస్వామి ఆలయం కనిపించింది. అలా ఆయన ద్వారా ఈ ఆలయం వెలుగుచూసింది. తర్వాత కాలంలో అభివృద్ధి చెందుతూ వచ్చింది. గర్భాలయంలో స్వామివారు కొలువుదీరి వుండగా, ప్రత్యేక మందిరాలలో శ్రీదేవి - భూదేవి పూజలు అందుకుంటున్నారు.

స్వామివారికి ప్రతియేటా చైత్ర శుద్ధ ఏకాదశి నుంచి వైశాఖ బహుళ పాడ్యమి వరకూ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. ఇక దసరా నవరాత్రులు ... ముక్కోటి ఏకాదశి వంటి పర్వదినాల్లో విశేష పూజలు ... ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఆపదమొక్కులవాడి అనుగ్రహాన్ని కోరుతూ భక్తులు అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకుంటారు ... తమ శక్తిమేర కానుకలు సమర్పించుకుంటారు.

More Bhakti Articles