వడ్డన పద్ధతులు

వడ్డన పద్ధతులు
శుభకార్యాలలో విందు భోజనానికి ఎక్కువ ప్రాముఖ్యత వుంటుంది. శుభకార్యాన్ని జరిపేవారిని బంధుమిత్రులు వచ్చి పలకరించినదే తడవుగా భోజనాలు చేసి వెళ్లమని చెబుతుంటారు. భోజనాలు బాగా వున్నాయని బంధుమిత్రులు అంటే ఇక ఆ శుభాకార్యాన్ని తాము విజయవంతంగా నిర్వహించినట్టు వాళ్లు భావిస్తారు.

ఇక ఈ శుభకార్యాల్లో భోజనాలు వడ్డించే కార్యక్రమం ఎంతో సందడిగా కనిపిస్తుంటుంది. ఒక్కొక్కరు ఒక్కో పదార్థాన్ని విస్తళ్లలో వడ్డిస్తూ వెళుతుంటారు. ముందుగా పప్పు ... చివర్లో మజ్జిగ అనే సూత్రం పైనే ఈ వడ్డన కొనసాగుతుంటుంది. అయితే మన పూర్వీకులు వడ్డన విషయంలో పద్ధతిని పాటిస్తూ వచ్చారు. ఆ పద్ధతిని పరిశీలిస్తే ... ఆహార పదార్థాలను వడ్డించడానికి వాళ్లు అరిటాకు శ్రేష్టమైనదిగా భావించారు.

అరిటాకులో ముందుగా కూరలను వడ్డించిన తరువాత మధ్య భాగంలో అన్నాన్ని వడ్డించాలి. ముందే ఉత్త అన్నాన్ని వడ్డించడాన్ని శాస్త్రం తప్పు పడుతుంది. ఇక పప్పు ... పాయసాలను అరిటాకు కుడి వైపున, పిండి పదార్థాలను ఎడమవైపున వడ్డించాలి. అతిథులు భోజనానికి కూర్చున్నప్పుడు వాళ్లు తినడం ప్రారంభించక ముందే నెయ్యి వడ్డించాలి ... తినడం ఆరంభించాక ఉప్పును వడ్డించాలి.

ఇక ఉప్పును అడిగి వడ్డించ కూడదనీ, ఒకవేళ వడ్డించడం మరిచిపోయినా అడగకూడదని అంటూ వుంటారు. ఆచారాన్ని గౌరవిస్తూ ... ఈ విధమైన పద్ధతులను పాటిస్తూ జరిపిన వడ్డన వల్లనే ఫలితం దక్కుతుందని శాస్త్రాలు చెబుతున్నాయి.

More Bhakti Articles