సిద్ధుల గుట్ట

సిద్ధుల గుట్ట
పరమశివుడు ఆవిర్భవించిన క్షేత్రాలు ఆయన లీలావిశేషాలను అత్యద్భుతంగా ఆవిష్కరిస్తుంటాయి. ఆయన నెలవైన ప్రతి క్షేత్రం వెనుక అందమైన ... ఆసక్తికరమైన కథలు కనిపిస్తుంటాయి. కరుణా సముద్రమై తన భక్తులను ఆదుకున్న అనుభవాలు వినిపిస్తుంటాయి. ఈ తరహాలో ఆవిర్భవించిన మరో శివ క్షేత్రమే 'సిద్ధుల గుట్ట'. ఇది రంగారెడ్డి జిల్లాలోని శంషాబాద్ గుట్టపై దర్శనమిస్తుంది.

సిద్ధులు తపమాచరించిన కారణంగా ఈ గుట్టకు 'సిద్ధుల గుట్ట' అనే పేరు వచ్చింది. ఇక ఈ కొండ తెలుపు రంగులో వుండటం వలన 'వెండి కొండ' అనీ, సిద్ధులు పూజించిన కారణంగా ఇక్కడి స్వామిని సిద్ధేశ్వర స్వామిగా కొలుస్తుంటారు. పూర్వం కాశీ నుంచి కాలినడకన వస్తోన్న సిద్ధులు ఈ పరిసరప్రాంతాల్లో కరవుకాటకాలు వుండటం చూశారు. ఇక్కడి కొండపై గల శివలింగానికి పూజలు లేకుండా ఉండటమే అందుకు కారణమని భావించారు. శివలింగాన్ని పునఃప్రతిష్ఠించి భక్తి శ్రద్ధలతో పూజించారు.

కరవుకాటకాలు కనుమరుగై పోవడంతో, స్వామివారికి నిత్య పూజాభిషేకాలు ప్రారంభమయ్యాయి. భవానిగా అమ్మవారు ... గణపతి ... వీరభద్రుడు ... హనుమంతుడు ... నవగ్రహాలు ... ఈ క్షేత్రంలో పూజలు అందుకుంటూ వుంటారు. ప్రతియేటా ఇక్కడి స్వామివారికి జరిగే బ్రహ్మోత్సవాలలో భక్తులు అత్యధిక సంఖ్యలో పాల్గొంటూ వుంటారు. అడుగడుగునా తమని అనుగ్రహిస్తూ వస్తోన్న స్వామికి కృతజ్ఞతలు తెలియజేస్తూ వుంటారు.

More Bhakti Articles