విశిష్ట సాయి మందిరం

విశిష్ట సాయి మందిరం
భక్తుల బాధలను ... కష్టాలను తనవిగా భావించి భరించిన సకలదైవ స్వరూపం సాయి. ఎక్కడో మహారాష్ట్రలో మారుమూల గ్రామమైన శిరిడీ, మహిమాన్వితమైన దివ్య క్షేత్రమై అలరారుతోందంటే అందుకు కారణం ఆయన భక్తుల పాలిట బంధువై నిలవడమే.

సాయి ఉన్నంత వరకూ తాము హాయిగా ఉండవచ్చనే భరోసా భక్తులకు కలిగించిన కారణంగానే, ఈ రోజున ప్రతి గ్రామంలో సాయి మందిరాలు కన్పిస్తున్నాయి. ప్రతి ఇంటా ఆయన భజనలు మారుమోగుతున్నాయి. సాయి లీలా విశేషాలను పరిశీలిస్తే, ఎవరు ఏ దృష్టితో చూస్తే వారికి ఆయన ఆ రూపాల్లోనే దర్శనమిచ్చాడు.

అలాంటి అనుభవం ఎదురైన ఒక భక్తుడే సాయికి నెల్లూరులోని గాంధీ నగర్ లో ఆలయాన్ని నిర్మించాడు. అయ్యప్ప స్వామి భక్తుడైన రాజగోపాలాచారి, యాభై సంవత్సరాల క్రితం శిరిడీ వెళ్లగా సాయి ఆయనకీ అయ్యప్ప స్వామిలానే కనిపించాడట. దాంతో అక్కడి నుంచి తిరిగి వచ్చిన ఆ భక్తుడు, అయ్యప్ప స్వామి ఆలయ నిర్మాణ శైలిలో మందిరాన్ని నిర్మించి అందులో సాయిబాబా విగ్రహాన్ని ప్రతిష్ఠించాడు.

తొలితరం శిరిడీ సాయి మందిరాలలో ఇది ఎంతో విశిష్టమైనదిగా చెబుతుంటారు. సాధారణంగా మందిరంలోని వేదికపై బాబా విగ్రహం కొలువై కనిపిస్తూ వుంటుంది. కానీ అందుకు భిన్నంగా ఇక్కడ బాబా గర్భాలయంలో దర్శనమిస్తుంటాడు. విశాలమైన మందిరం ... ధ్యాన మందిరం ... అన్నదానపు మందిరం ఆలయ వైభవానికి నిలువుటద్దమై నిలుస్తుంటాయి. ప్రతి నిత్యం బాబాకి పూజాభిషేకాలు ... నాలుగు హారతులు ఘనంగా నిర్వహిస్తుంటారు.

ఇక ప్రతి గురువారంతో పాటు పర్వదినాల్లో పల్లకీ సేవ ... పవళింపు సేవ జరుగుతుంటాయి. ఈ వేడుకలో భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొంటూ వుంటారు. ఇక్కడి సాయి పాదాలను ఆశ్రయించిన వారికి ఆయన ఏ లోటూ రానీయడని భక్తులు అనుభవ పూర్వకంగా చెబుతూ వుంటారు.

More Bhakti Articles