స్థల మహాత్మ్యం

స్థల మహాత్మ్యం
సాధారణంగా ఎవరైనా ఒక ప్రదేశంలో వుండగా ఒకలా ప్రవర్తించి ... మరో ప్రదేశానికి వెళ్లగానే మరోలా వ్యవహరించినట్టయితే, ఆ మార్పుకు ఆశ్చర్యచకితులైన వాళ్లు స్థల ప్రభావమనో ... స్థల మహిమనో చెప్పుకుంటూ వుంటారు. ఈ నేపథ్యంలో నిజంగానే స్థలాలు వ్యక్తుల మనస్తత్వాలను ప్రభావితం చేస్తాయా అనే సందేహం చాలా మందిలో తలెత్తుతూ వుంటుంది.

పురాణాలు మాత్రం వ్యక్తుల వ్యవహార శైలిపై స్థల ప్రభావం ఉంటుందని చెబుతున్నాయి. అందుకు నిదర్శనంగా శ్రవణ కుమారుడి వృత్తాంతాన్ని ఆవిష్కరిస్తున్నాయి. శ్రవణ కుమారుడికి తల్లిదండ్రులంటే పంచప్రాణాలు. వృద్ధులైన తల్లిదండ్రులను విడిచి క్షణకాలం కూడా ఉండేవాడు కాదు. అనుక్షణం వారిని కంటికి రెప్పలా కనిపెట్టుకుని ఉండేవాడు. మోక్ష మార్గాన్ని కోరుకుంటోన్న తల్లిదండ్రులకు పుణ్య క్షేత్రాలను దర్శింపజేయాలని నిర్ణయించుకున్నాడు. వారిని 'కావడి'లో కూర్చుండ బెట్టుకుని వివిధ క్షేత్రాలను చూపించ సాగాడు.

ఇందులో భాగంగా ఆయన ఒక ప్రదేశానికి రాగానే కావడిని కిందకి దింపి, ఇక వాళ్ల భారాన్ని మోయడం తన వలన కాదంటూ తల్లిదండ్రుల పట్ల అసహనాన్ని వ్యక్తం చేశాడు. ఊహించని ఆ సంఘటనకు వాళ్లు బిత్తరపోయారు. అంతలో అటుగా వచ్చిన ఒక మునీశ్వరుడు విషయం తెలుసుకుని, వారిని తన ఆశ్రమంలో వదలి వెళ్లవలసినదిగా శ్రవణ కుమారుడిని కోరాడు. చిరాకుపడుతూనే ఆ మునీశ్వరుడి వెంట నడచిన శ్రవణకుమారుడు, కావడితో ఆశ్రమంలోకి అడుగు పెడుతూనే తనని మన్నించమంటూ తల్లిదండ్రుల పాదాలపై పడ్డాడు.

జరిగిన దాంట్లో ఆయన తప్పేమీ లేదనీ ... అక్కడి స్థల మహాత్మ్యమే అందుకు కారణమని ఆ మునీశ్వరుడు చెప్పాడు. గతంలో అక్కడ రాక్షస ప్రవృత్తి కలిగిన వారు నివసించడం వలన ఆ స్థలం అపవిత్రమైందనీ .. అదే ఆయనపై అలాంటి ప్రభావం చూపిందని అన్నాడు. అలాగే మహర్షులు .. మహా భక్తులు .. మహనీయులు నడయాడిన పుణ్య భూముల్లో సంచరించడం వలన కూడా జీవితంపై మంచి ప్రభావం పడుతుందనీ, అది మోక్షమార్గం వైపు నడిపిస్తుందని సెలవిచ్చాడు. తనకి జ్ఞానోపదేశం చేసిన ఆ మునీశ్వరుడికి శ్రవణ కుమారుడు కృతజ్ఞతలు తెలియజేసి, తన తల్లిదండ్రులతో అక్కడి నుంచి బయలుదేరాడు.

More Bhakti Articles