సుంకిశాల

సుంకిశాల
ఒకప్పుడు ప్రతి ఊళ్లోను శివాలయం గానీ ... రామాలయం గాని తప్పనిసరిగా ఉండేవి. కొన్ని ఊళ్లలో రెండు ఆలయాలు కూడా ఉండేవి. శైవ ... వైష్ణవ సంబంధ పర్వదినాలను బట్టి భక్తులు ఆయా ఆలయాలకు వెళ్లేవారు. ఒకే రోజున రెండు ఆలయాలకు వెళ్ళవలసి వస్తే మాత్రం భక్తులు కాస్త ఇబ్బంది పడేవారు. అయితే ఇటీవల కాలంలో నిర్మించబడుతోన్న ఆలయాలను పరిశీలిస్తే నిర్వాహకులు ఈ విషయంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టినట్టు అర్థమవుతుంది.

నూతన ఆలయాలను వివిధ దేవతా మూర్తుల ఆరాధనకు అనుకూలంగా తీర్చిదిద్దుతున్నారు. ఈ కారణంగానే ఇప్పుడు శివకేశవులను ఒకే చోట దర్శించుకునే భాగ్యం కలుగుతోంది. వివిధ దేవతా మూర్తులతో అలా రూపొందిన క్షేత్రం మనకి నల్గొండ జిల్లా 'సుంకిశాల' లో కనిపిస్తుంది. విదేశాలలో స్థిరపడిన ఈ ప్రాంతానికి చెందిన ఓ భక్తుడు ఇక్కడి ఆలయాలను నిర్మించాడు. పచ్చదనం ... పరిశుభ్రత ... ప్రవిత్రత ... ప్రశాంతత అనే వేదికపై ఇక్కడి ఆలయాలు వరుసగా కొలువుదీరి కనిపిస్తుంటాయి.

శ్రీ వేంకటేశ్వరుడు ... భవానీ శంకరుడు ... సీతారాములు ... శిరిడీ సాయినాథుడు నయనానందకరంగా దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంటారు. సరస్వతీ దేవి ... దుర్గాదేవి కూడా ప్రత్యేక మందిరాలలో పూజలు అందుకుంటూ వుంటారు. శ్రీ వేంకటేశ్వర స్వామికి ధనుర్మాసంలో ప్రత్యేక పూజలు ... తిరునక్షత్ర ఉత్సవాలు ... వార్షిక బ్రహ్మోత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు.

ఇతర దేవతా మూర్తులకు కూడా ఆయా పుణ్య తిథుల్లో విశేష పూజలు ... ఉత్సవాలు జరుగుతుంటాయి. వివిధ దేవతా మూర్తులు కొలువుదీరిన కారణంగా ఈ క్షేత్రానికి భక్తుల రాక భారీగానే వుంటుంది. ఆలయ ప్రాంగణంలో అడుగుపెట్టిన ప్రతిఒక్కరికి మానసిక పరమైన ప్రశాంతత లభిస్తుంది ... ఆధ్యాత్మిక పరమైన అనుభూతి కలుగుతుంది.

More Bhakti Articles