బిక్కవోలు

బిక్కవోలు
శివ పార్వతుల ముద్దుల తనయుడు అయిన కుమారస్వామి, వివిధ పేర్లతో అనేక క్షేత్రాల్లో ఆవిర్భవించాడు. కుమారస్వామి ఏ పేరుతో ఎక్కడ అవతరించినా ఆయన ప్రతి క్షేత్రానికి ప్రత్యేకత వుంటుంది ... వీలైనంత విశిష్టత వుంటుంది.

సాధారణంగా కుమారస్వామి క్షేత్రాలలో ఆయన యువకుడిగా ... వల్లీ దేవసేన సమేతుడిగా ... సర్పాకారంలో సుబ్రహ్మణ్య స్వామిగా దర్శనమిస్తుంటాడు. అయితే ఆయన బాలుడిగా కొలువుదీరిన క్షేత్రాలు మాత్రం చాలా అరుదుగానే కనిపిస్తూ వుంటాయి. అలాంటి క్షేత్రాల జాబితాలో 'బిక్కవోలు' ముందువరుసలో కనిపిస్తుంది. తూర్పు గోదావరి జిల్లాలోని ఈ క్షేత్రం ఎంతో మహిమాన్వితమైనదిగా ప్రసిద్ధి చెందింది.

ఇక్కడి ఆలయం నాటి ప్రాచీన వైభవానికి అద్దం పడుతుంటుంది. క్రీ.శ. 9వ శతాబ్దంలో తూర్పు చాళుక్యులు స్వామివారి విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్టు ఆధారాలు వున్నాయి. ఆ తరువాత వచ్చిన రాజ వంశీకులు ఆలయ అభివృద్ధికి తమ వంతు కృషి చేశారు. గర్భాలయంలో స్వామి బాలుడిగా ముద్దులొలుకుతూ, పార్వతీ దేవి దగ్గరే కాదు మన దగ్గర కూడా గారాలు పోతున్నట్టుగా దర్శనమిస్తుంటాడు.

'సుబ్రహ్మణ్య షష్ఠి' రోజున ఇక్కడ విశేష పూజలు జరుగుతుంటాయి. ఈ రోజున ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగానే వుంటుంది. బాలుడే అయినా ఈ సుబ్రహ్మణ్యుడు భారీగా వరాలను ప్రసాదిస్తాడని స్థానికులు చెబుతుంటారు. స్వామి వారిని దర్శించుకున్న భక్తులకు ఇక్కడ 'పుట్టమన్ను' ప్రసాదంగా ఇస్తుంటారు. ఈ పుట్టమన్ను స్వీకరించిన వారికి మనసులోని కోరికలు నెరవేరతాయని చెబుతుంటారు.

ఇక ఇదే ప్రాంగణంలో శ్రీ బాలాత్రిపుర సుందరి - శ్రీ చంద్రశేఖర స్వామి మందిరాలు, శ్రీ రాజరాజేశ్వరీ అమ్మవారి మందిరం కొలువుదీరి కనిపిస్తుంటాయి. ఇక్కడికి సమీపంలో వినాయకుడు కూడా భక్తులచే పూజలు అందుకుంటూ ఉంటాడు. మొత్తం మీద ఈ క్షేత్రానికి వచ్చిన వారు శివ కుటుంబాన్ని దర్శించుకుని ధన్యులు కావచ్చుననడంలో ఎలాంటి సందేహం లేదు.

More Bhakti Articles