రేణుకా ఎల్లమ్మ క్షేత్రం

రేణుకా ఎల్లమ్మ క్షేత్రం
ప్రాచీనకాలం నుంచి రేణుకా ఎల్లమ్మ గ్రామదేవతగా పూజలు అందుకుంటోంది. ఎల్లమ్మను తమ కుల దైవంగా ... ఇష్ట దైవంగా భావించి కొలిచేవారు ఎందరో ఉన్నారు. అలా అశేష భక్త జనకోటిచే అమ్మవారు నిత్య నీరాజనాలు అందుకుంటోన్న క్షేత్రం హైదరాబాదులోని 'బల్కమ్ పేట'లో దర్శనమిస్తుంది. ఇక్కడి అమ్మవారికి దాదాపు 300 సంవత్సరాల చరిత్ర ఉన్నట్టు స్థల పురాణం చెబుతోంది.

విశాలమైన ఆలయం ... ఆకర్షణీయమైన రాజగోపురం ... ముఖ మంటపంలో కొలువుదీరిన అమ్మవారి వివిధ చిత్రాలు కనువిందు చేస్తాయి. ఇక్కడి అమ్మవారు శయన మూర్తిగా ఆవిర్భవించడం విశేషం. అమ్మవారు ఆవిర్భవించిన ప్రదేశంలో నుంచి నీరు అదే పనిగా ఊరుతుంటుంది. ఈ కారణంగా ఇక్కడి అమ్మవారిని 'జలదుర్గ' అని పిలుస్తూ వుంటారు. ఈ నీటిని స్వీకరించడం వలన అనేక వ్యాధుల బారి నుంచి ఉపశమనం లభిస్తుందని అంటారు.

భక్తులు అమ్మవారితో పాటు అఖండ దీపారాధన మందిరాన్ని దర్శించుకుని, అమ్మవారి పాదుకలకు కుంకుమ అభిషేకాలు చేస్తుంటారు. ఎల్లమ్మ తల్లి పట్ల ప్రేమతో తాము తీసుకు వచ్చిన 'పూలు' ... 'గాజులు' ... 'రవికెలు' ... 'నిమ్మకాయలు' సమర్పిస్తుంటారు. అమ్మవారు తమ కోరికలను నేరవేర్చినందుకు గాను గండా దీపాలు ... బోనాలు సమర్పిస్తూ వుంటారు.

ఇక ఇదే ప్రాంగణంలో పోచమ్మ తల్లి ... నాగదేవత మందిరాలు కూడా దర్శనమిస్తుంటాయి. ఈ దేవతలను కూడా భక్తులు పూజిస్తూ తరిస్తుంటారు. అమ్మవారికి ఎంతో ఇష్టమైన వసంత నవరాత్రి ఉత్సవాలు ... శరన్నవ రాత్రి ఉత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. అంగరంగ వైభవంగా జరిగే ఈ వేడుకల్లో భక్తులు వేల సంఖ్యలో పాల్గొంటారు.

More Bhakti Articles