శ్రీ సారంగధరేశ్వర క్షేత్రం

శ్రీ సారంగధరేశ్వర క్షేత్రం
ఒకప్పుడు రాజమహేంద్రవరంగా పిలవబడిన ఈనాటి రాజమండ్రి అనేక విశిష్టమైన ఆలయాలకు వేదికగా నిలిచింది. అలాంటి ఆలయాలలో 'శ్రీ సారంగధరేశ్వర క్షేత్రం' ప్రాచీన వైభవంతో అలరారుతోంది. ఈ ప్రాంతంలో సదాశివుడు సారంగధరేశ్వరుడిగా కొలువుదీరడానికి బలమైన కారణమే వుంది. 11 వ శతాబ్దంలో ఈ ప్రాంతం రాజరాజ నరేంద్రుడి ఏలుబడిలో వుండేది ... ఆయన కుమారుడే సారంగధరుడు.

యుక్త వయసులోకి అడుగుపెట్టిన సారంగధరుడికి వివాహం జరిపించేందుకు తండ్రి ప్రయత్నాలు ప్రారంభించాడు. తండ్రి నిర్ణయాన్ని సున్నితంగా తిరస్కరిస్తూ, సారంగధరుడు సన్యాసం స్వీకరించాడు. నిరంతరం శివ ధ్యానం చేస్తూ ఇక్కడి గోదావరి నదీ తీరంలో శివలింగాన్ని ప్రతిష్ఠించాడు. ఈ కారణంగానే శివయ్యను 'సారంగధరేశ్వర స్వామి'గా పిలుస్తూ వుంటారు. ఇక అమ్మవారు లలితాంబికగా పూజలు అందుకుంటూ వుంటుంది.

ఆనాటి నుంచి ఈ క్షేత్రం దినదిన ప్రవర్ధమానంగా వెలుగొందుతోంది. విశాలమైన ప్రాంగణంలో వినాయకుడు ... సుబ్రహ్మణ్య స్వామి ... సీతారాములు ... కాలభైరవుడు ... నవగ్రహాల మందిరాలతో పాటు, సారంగధరుడి ప్రతిమ కూడా దర్శనమిస్తుంది. శతాబ్దాల చరిత్రకు నిలువెత్తు నిదర్శనంలా కనిపించే ఇక్కడి స్వామిని దర్శించడం వలన, సమస్త విద్యలు ... సకల శుభాలు ప్రాప్తిస్తాయని భక్తులు విశ్వసిస్తుంటారు. పర్వదినాల సమయంలో స్వామివారికి విశేష అలంకారాలు ... ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భంలో స్వామివారిని దర్శించి తరించే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది.

More Bhakti Articles