శ్రీ సూర్య నారాయణ క్షేత్రం

శ్రీ సూర్య నారాయణ క్షేత్రం
సూర్యుడిని ప్రత్యక్ష దైవంగా భావించి పూజించే సంప్రదాయం పూర్వ కాలం నుంచి వుంది. ఈ కారణంగానే ఆయనని సూర్యనారాయణమూర్తి అని పిలుస్తూ వుంటారు. సాధారణంగా సూర్యుడి కిరణాలు ఇతర ఆలయాలలోని మూలమూర్తిపై పడితే ఆ క్షేత్రం ఎంతో విశిష్టమైనదిగా చెబుతుంటారు. అలాంటిది సాక్షాత్తు ఆయనే మూలమూర్తిగా అవతరించిన క్షేత్రాలు ఎంత పవిత్ర మైనవో, మరెంత విశిష్టమైనవో ఊహించవచ్చు. అలా సూర్యనారాయణ స్వామి కొలువుదీరిన క్షేత్రం మనకి తూర్పుగోదావరి జిల్లాలోని 'గొల్లలమామిడాడ'లో దర్శనమిస్తుంది.

ఇక్కడి గర్భాలయంలో స్వామి ఉష - ఛాయ సమేతుడై భక్తులను అనుగ్రహిస్తుంటాడు. సౌందర్య శోభితంగా తీర్చిదిద్దిన ముఖమంటపంలో ఒక వైపున లక్ష్మీ నారాయణ స్వామి మందిరం ... మరో వైపున శ్రీ సత్యనారాయణ స్వామివారి మందిరం దర్శనమిస్తుంటాయి. ఇక్కడి స్వామివారిని దర్శించడం వలన గ్రహదోషాలు నివారించబడతాయనీ ... చర్మ సంబంధమైన వ్యాధులు దూరమవుతాయని భక్తులు విశ్వసిస్తుంటారు.

ధనుర్మాసంలో స్వామివారికి ప్రత్యేక పూజలు జరుగుతుంటాయి. అలాగే 'తొలి ఏకాదశి' ... 'భీష్మ ఏకాదశి' ... 'రథసప్తమి' రోజుల్లో విశేష పూజలు నిర్వహిస్తుంటారు. ఈ సందర్భాల్లో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగా వుంటుంది. ఇక ప్రతి యేటా జూన్ మాసంలో ఆలయ వార్షికోత్సవం సందర్భంగా జరిగే స్వామివారి కల్యాణోత్సవం చూసి తీరవలసిందే.

More Bhakti Articles