సిద్ధేశ్వర ఆలయం

సిద్ధేశ్వర ఆలయం
ప్రాచీనకాలంలో సిద్ధులు కొలువుదీరిన క్షేత్రం నేడు భక్తుల కోరికలను తీరుస్తూ 'సిద్ధేశ్వర క్షేత్రం' గా విరాజిల్లుతోంది. నెల్లూరు జిల్లా గూడూరు సమీపంలో 'సైదాపురం'లో ఈ క్షేత్రం దర్శనమిస్తుంది. రెండువేల సంవత్సరాల క్రితం ఈ క్షేత్రం వెలుగు చూసిన తీరు ఎంతో ఆసక్తికరంగా వుంటుంది.

పూర్వం ఈ ప్రాంతానికి చెందిన ఓ గిరిజనుడు ఇక్కడి అడవిలో వేటకి వెళ్లి దారితప్పి పోయాడట. ఆ రాత్రి ఓ కొండపై నుంచి వెలుగు వస్తుండటం చూసి, అక్కడికి చేరుకున్నాడు. ముగ్గురు సిద్ధులు ధ్యానంలో వుండటం ... వారి శరీరం నుంచి ఆ వెలుగు రావడం చూసి ఆశ్చర్య పోయాడు. ధ్యానంలో నుంచి బయటికి వచ్చిన సిద్ధులు, తమ విషయం ఎవరితో చెప్పినా అతను ఆ క్షణమే మరణిస్తాడని అన్నారు.

మరుసటి రోజు ఇంటికి చేరుకున్న ఆ గిరిజనుడు, తాను చూసినది మనసులో దాచుకోకుండా గూడెంలో వున్న వారికి చెప్పేశాడు. ఆ క్షణమే అతను మరణించడంతో, గూడెంలో వున్న వారంతా కలిసి ఆ కొండపైకి చేరుకున్నారు. వారు చూస్తుండగానే ఆ ముగ్గురు సిద్ధులు శిలలుగా మారిపోయారు. ఆ రోజు నుంచి ఇక్కడి ప్రజలు వారిని పూజిస్తూ వస్తున్నారు. ఆనాటి నుంచి ఈ కొండ ... సిద్ధుల కొండగా ప్రసిద్ధి చెందింది.

సిద్ధులు శిలలుగా మారిన దగ్గర నుంచి ఒక పులి ... పాము ... ఉడుము ఈ మూర్తులను పూజిస్తూ వుండటం స్థానికులు గమనించారు. అందువలన కొండపైకి చేరుకునే ముందు డప్పులతో శబ్దాలు చేస్తూ వెళ్లడం చేస్తుంటారు. ఇక్కడ చిన్నవే అయినా ఏడు కోనేరులు కనిపిస్తూ వుంటాయి. వీటిలో స్నానం చేయడం వలన సమస్త వ్యాధులు తొలగి పోతాయని చెబుతుంటారు. ఇక ఇక్కడ నవగ్రహాలను సతీసమేతంగా ప్రతిష్ఠించడం విశేషం.

ఈ సిద్ధులను పూజించి ఎవరు ఏది కోరుకున్నా తప్పక నెరవేరుతుందని స్థానికులు చెబుతుంటారు. కార్తీకమాసంలో ప్రతి సోమవారం రోజున ఇక్కడ ఉత్సవాలు నిర్వహిస్తూ వుంటారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనడానికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు ఇక్కడికి చేరుకుంటూ వుంటారు. ప్రశాంతమైన వాతావరణంలో కొలువుదీరిన ఈ క్షేత్రాన్ని దర్శించుకోవడం మానసిక పరమైన ఉల్లాసాన్ని కలిగిస్తుంది ... ఆధ్యాత్మిక పరమైన అనుభూతిని అందిస్తుంది.

More Bhakti Articles