వనభోజన ఫలితం

వనభోజన ఫలితం
శివకేశవులకు ఎంతో ఇష్టమైన మాసంగా కార్తీకమాసం చెప్పబడుతోంది. ఈ మాసంలో వనభోజనాలకు వున్న ప్రాధాన్యత అంతా ఇంతా కాదు. కార్తీకమాసంలో ఉసిరి చెట్టును పూజించి నైవేద్యాలు సమర్పించి దానిని ప్రసాదంగా స్వీకరించాలని శాస్త్రం చెబుతోంది. ఈ విధంగా చేయడం వలన 'అశ్వమేధయాగం' చేసిన ఫలం లభిస్తుందని అంటారు.

ఈ కారణంగానే పల్లెల్లోనూ ... పట్నాల్లోనూ చుట్టుపక్కల వారంతా కలిసి కార్తీక మాసంలో వనభోజనాలకు వెళుతుంటారు. వనభోజనాల వలన మానసిక పరమైన ప్రశాంతత లభించడమే కాకుండా, శ్వాస సంబంధమైన వ్యాధుల బారినపడకుండా వుండటం జరుగుతుంది. ఇక వనభోజనాల కారణంగా పాపాలు ... శాపాలు కూడా నశించి, ఉన్నతమైన స్థితి కలుగుతుందని పురాణాలు చెబుతున్నాయి. అందుకు నిదర్శనంగా 'దేవదత్తుడు' అనే బ్రాహ్మణుడి వృత్తాంతాన్ని వివరిస్తున్నాయి.

దేవశర్మ అనే పండితుడి కుమారుడైన దేవదత్తుడు, తండ్రి మనస్తత్వానికి పూర్తి విరుద్ధంగా వ్యవహరించసాగాడు. దేవుడిపట్ల విశ్వాసం లేకపోవడం ... ఆయన భక్తులను అవమానపరచడం వంటివి చేస్తూ ఉండేవాడు. దాంతో ఆగ్రహించిన తండ్రి 'ఎలుక' గా మారిపొమ్మంటూ కొడుకుని శపించాడు. ఎలుకగా మారిన దేవదత్తుడు ఒక అడవిలోని ఉసిరి చెట్టుకింద కలుగులో జీవించసాగాడు. అలాంటి పరిస్థితుల్లో విశ్వామిత్ర మహర్షి తన శిష్యులతో కలిసి వనభోజనాలకుగాను ఆ అడవికి వచ్చాడు.

ఎలుక రూపంలో దేవదత్తుడు వున్న చెట్టుకింద నైవేద్యాలు వండించి ... నైవేద్యంగా సమర్పించి ... కార్తీక మాస విశిష్టతను గురించి శిష్యులతో చెప్పాడు. చెట్టుకింద కలుగులో వున్న ఎలుక అదంతా విని, ఎవరూ చూడకుండా కొంచెం ప్రసాదాన్ని తినేసింది. దాంతో వనభోజన ఫలితంగా ఎలుక నిజరూపాన్ని పొంది దేవదత్తుడిగా మారిపోయాడు. విశ్వామిత్ర మహర్షి ఆశీస్సులు తీసుకుని ఇంటికి చేరుకొని తల్లిదండ్రుల పాదాలకు నమస్కరించాడు. తండ్రి అడుగుజాడల్లో నడుస్తూ భక్తి శ్రద్ధలతో దైవాన్ని సేవిస్తూ తరించాడు.

More Bhakti Articles