శ్రీ గంగా గౌరీశ్వర క్షేత్రం

శ్రీ గంగా గౌరీశ్వర క్షేత్రం
గంగాదేవి సమేతంగా పరమశివుడు ఆవిర్భవించిన క్షేత్రాలు ఎంతో విశిష్టమైనవిగా భక్తుల పూజలు అందుకుంటూ వున్నాయి. అలాంటి ప్రసిద్ధమైన క్షేత్రం మనకి విశాఖ జిల్లా చోడవరంలో కనిపిస్తుంది. ఇక్కడి శివుడికి వేల సంవత్సరాల చరిత్ర వుందని చెబుతారు. చోళ రాజుల్లో ఒకరైన గౌరీశ్వరుడు ఈ ప్రాంతాన్ని పాలిస్తోన్న సమయంలో ఆయనకి పరమశివుడు కలలో కనిపించి, ఫలానా ప్రదేశంలో తాను గంగాదేవి సమేతుడనై ఉన్నాననీ ... ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడట.

దాంతో శివుడు చెప్పిన ఆనవాళ్ల ప్రకారం రాజు ఆ శివలింగాన్ని కనుగొన్నాడు. అదే సమయంలో అక్కడికి దగ్గరలోనే నందీశ్వర విగ్రహం ... ద్వార పాలకుల ప్రతిమలు బయటపడ్డట్టు రాజు గారికి తెలిసింది. దాంతో ఆ ప్రతిమలకు ఆలయాన్ని నిర్మించి వాటిని ప్రతిష్ఠించాడు. గంగా సమేతంగా ఆవిర్భవించిన కారణంగా ... గౌరీశ్వరుడు ప్రతిష్ఠించిన కారణంగా ఇక్కడి స్వామివారికి 'గంగా గౌరీశ్వరుడు' అనే పేరు వచ్చింది.

సాధారణంగా దెబ్బతిన్న దైవ రూపం ఏదీ కూడా పూజకు పనికిరాదని చెబుతుంటారు. అందుకు భిన్నంగా ఇక్కడ దెబ్బతిన్న శివలింగానికే పూజలు జరుగుతుంటాయి. శివుడి ఆదేశం మేరకే అలా జరుగుతుందని భక్తులు చెబుతుంటారు. ఈ క్షేత్రంపై మతపరమైన దాడి జరగగా శివలింగం దెబ్బతింది. పునరుద్ధరించడానికి రాజుగారు ప్రయత్నించగా శివుడు కలలోకొచ్చి వారించాడని అంటారు. పర్వదినాల్లో స్వామివారికి ప్రత్యేక పూజలు ... ఉత్సవాలు జరుగుతుంటాయి.

గంగా సమేతంగా శివుడు వెలసిన కారణంగా ఇక్కడ నీటి కొరత ఏర్పడలేదనీ, పంటలు సమృద్ధిగా పండటానికి కూడా ఈ స్వామియే కారకుడని భక్తులు విశ్వసిస్తుంటారు. మనసున్న మహాదేవుడు ... మా దేవుడంటూ భక్తి శ్రద్ధలతో పూజించుకుంటూ వుంటారు.

More Bhakti Articles