వీరభద్ర క్షేత్రం

వీరభద్ర క్షేత్రం
శివాంశతో జన్మించిన వీరభద్రుడు దక్ష యజ్ఞాన్ని ధ్వంసం చేసి దక్షుడిని సంహరించాడు. పరాక్రమానికి ... విజయానికి ప్రతీకగా నిలిచి దేవతలచే సైతం ప్రశంసలు అందుకున్నాడు. ఈ నేపథ్యంలో భక్తులచే ఆరాధనలు అందుకోవడానికిగాను ఆయన అనేక ప్రదేశాలలో అవతరించాడు. అలా ఆయన కొలువుదీరిన మరో విశిష్ట క్షేత్రంగా కర్ణాటక రాష్ట్రం బాగల్ కోట్ జిల్లాలోని 'ముచికుంద' దర్శనమిస్తుంది. పూర్వం ముచికుంద మహర్షి తపస్సు చేసిన ప్రదేశం కావడం వల్లనే ఈ ప్రాంతానికి ఈ పేరు వచ్చిందని అంటారు.

ప్రశాంతమైన వాతావరణంలో ఆవిర్భవించిన ఇక్కడి స్వామివారికి వందల యేండ్ల చరిత్ర వుంది. ఎంతోమంది రాజులు ... మహర్షులు ... మహాభక్తులు ... పీఠాధిపతులు ఈ క్షేత్రాన్ని దర్శించినట్టుగా ఆధారాలు వున్నాయి. విశాలమైన ఆలయ ప్రాంగణం ... చుట్టూ మనసుదోచే మందిరాలు ఇక్కడ దర్శనమిస్తాయి. గర్భాలయంలో వీరభద్రుడు 'పట్టసం' అనే ఆయుధాన్ని ధరించి కనిపిస్తాడు.

గర్భాలయానికి ఒక వైపున మహాదేవుడు ... మరో వైపున భద్రకాళి అమ్మవారు కొలువుదీరి కనిపిస్తుంటారు. వీరభద్రుడు మహా శివుడి అంశగా అవతరించాడు కనుక ముందుగా భక్తులు మహాదేవుడిని దర్శించుకుంటారు. ఆ తరువాత వీరభద్రుడిని ... భద్రకాళిని సేవించుకుంటారు. ఇదే ఆలయ ప్రాంగణంలో నవగ్రహ మంటపం ... మల్లికార్జున స్వామి మందిరం ... హనుమంతుడి పాద ముద్రలు దర్శనమిస్తాయి.

ఇక్కడి స్వామివారికి 'శ్రావణ మాసం' లో పెద్ద ఎత్తున 'జాతర' జరుగుతుంది. రుద్రుడి అంశతో వీరభద్రుడు అవతరించినప్పటికీ, ఆయనది మంచులాంటి మనసని భక్తులు చెబుతుంటారు. కోరిన వరాలను ఆనందంగా అనుగ్రహిస్తుంటాడని అంటారు. గ్రహపరమైన దోషాలు ... దుష్ట ప్రయోగాలు ఈ స్వామిని దర్శించినంతనే తొలగిపోతాయని చెబుతారు. తమని కరుణించేది ... కాపాడేది ఈ స్వామియేనని వాళ్లంతా బలంగా నమ్ముతుంటారు. ఈ కారణంగానే స్వామి వారి జాతరలో అంతా పెద్ద సంఖ్యలో పాల్గొంటారు.

More Bhakti Articles