కైకలూరు

కైకలూరు
ఆలయాల సముదాయంగా అలరారుతూ ... నిత్య కైంకర్యాలతో 'కైంకర్య పురి'గా వెలుగొందిన పవిత్రమైన ప్రదేశమే నేటి 'కైకలూరు'. కృష్ణా జిల్లాలోని ఈ ప్రాంతంలో శ్రీ శ్యామలాంబ ఆవిర్భవించింది. వందల సంవత్సరాల చరిత్ర గల ఈ క్షేత్రంలో అమ్మవారితో పాటు 'శ్రీ రామేశ్వర స్వామి' ... ' శ్రీ రామలింగేశ్వర స్వామి' ... 'శ్రీ కనకలింగేశ్వర స్వామి' కొలువుదీరి కనిపిస్తారు.

ఇక్కడ వినాయకుడు ప్రత్యేక మందిరంలోనే కాకుండా, ప్రతి శివాలయం పక్కనే దర్శనమిస్తూ వుండటం విశేషం. ప్రాచీన కాలానికి చెందిన ఈ ఆలయం కొంత కాలం కిందట శిధిలావస్థకు చేరుకోవడంతో, దాతల సహకారంతో జీర్ణోద్ధరణ చేశారు. అందమైన రాజగోపురం ... పొడవైన ప్రాకారాలు ... వరుసగా కనిపించే ధ్వజ స్తంభాలు ఆలయ వైభవానికి అద్దం పడుతుంటాయి. గర్భాలయంలో అమ్మవారు చిరునవ్వులు చిందిస్తూ శాంతమూర్తిగా దర్శనమిస్తుంది.

ఈ ప్రాంతానికి సంబంధించిన భక్తులు ఆమెను తమ ఇలవేల్పుగా భావిస్తుంటారు. భక్తులు తమ ఇంట జరిగే శుభకార్యాలకు తొలి ఆహ్వానం అమ్మవారికే అందజేస్తారు. అమ్మవారు తమని ఆదుకున్న తీరు గురించి భక్తులు కథలు కథలుగా చెబుతుంటారు. సాధారణ రోజుల్లో శుక్రవారం రోజున అమ్మవారిని పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకుంటారు. దసరా రోజున నవదుర్గలుగా అమ్మవారిని అలంకరించి విశేష పూజలు నిర్వహిస్తుంటారు.

ఇక 'మహా శివరాత్రి' పర్వదినం సందర్భంగా ... కార్తీక మాసంలోను శివాలయాల్లో ప్రత్యేక పూజలు - ఉత్సవాలు జరుగుతుంటాయి. స్థల ప్రాశస్త్యం ... ప్రాచీన వైభవం ... అమ్మవారి మహాత్మ్యం కారణంగా ఇక్కడికి వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలి వస్తుంటారు ... అమ్మ ఆశీర్వాదం తీసుకుని వెళుతుంటారు.

More Bhakti Articles