పాపానికి ఫలితం

పాపానికి ఫలితం
భగవంతుడు పుణ్య మార్గంలో నడచుకోమని సూచిస్తాడు. ఆ మార్గంలో ప్రయాణిస్తుంటే ప్రోత్సాహిస్తాడు. ఆయన సూచన మేరకు పుణ్య కార్యాలు చేస్తూ వెళుతుంటే, వాటికి తగిన ప్రతిఫలం అందేలా చేస్తాడు. అంతేగానీ కొన్ని పుణ్య కార్యాలు చేసినంత మాత్రాన గతంలో వారు చేసిన పాపాలను మాత్రం ఉపసంహరించడు.

పాపపుణ్యాల విషయంలో ఆయన దేనిలెక్క దానిదే అన్న విధంగా వ్యవహరిస్తుంటాడు. ఎంతటి పుణ్యాత్ముడైనా పాపం చేస్తే అందుకు ఫలితం అనుభవించక తప్పదనే సత్యాన్ని చాటిచెబుతూనే ఉంటాడు. అందుకు ఉదాహరణగా పరీక్షిత్తు మహారాజును గురించి చెప్పుకోవచ్చు. పరీక్షిత్తు మహారాజు ఎంతో ధర్మాత్ముడు ... సహనశీలి ... త్యాగశీలి. ప్రతి రోజు రాత్రి వేళ ఏకాంత మందిరంలో కూర్చుని తాను ఆ రోజు ఎవరి మనసునైనా నొప్పించానా అనే విషయం గురించి ఆలోచన చేసేవాడు.

అలాంటి పరీక్షిత్తు ఒకరోజున వేటకు వెళ్లాడు. ఓ జింకను వేటాడుతూ 'శమీక మహర్షి' ఆశ్రమానికి చేరుకున్నాడు. అక్కడి వరకూ వచ్చి అదృశ్యమైన జింక గురించి మహర్షిని అడిగాడు. ధ్యానంలో వున్న మహర్షికి అతని మాటలు వినిపించలేదు. శమీకుడు సమాధానం చెప్పకపోవడం అహంకారంగా భావించిన పరీక్షిత్తు, అతణ్ణి అవమానపరచాలని నిర్ణయించుకున్నాడు. ఆ పక్కనే చచ్చి పడున్న పామును తన చేతిలోని విల్లు కొనతో తీసి ఆ మహర్షి మెడలో వేశాడు. అయినా ఆయనలో ఎలాంటి చలనం లేకపోవడంతో, పరీక్షిత్తు తన తప్పు తెలుసుకుని భారమైన మనసుతో అక్కడి నుంచి వెళ్లిపోయాడు.

తన తండ్రిని పరీక్షిత్తు అవమాన పరిచిన విషయం శిష్యుల ద్వారా 'శృంగి' కి తెలిసింది. అంతే ఆగ్రహావేశాలకు లోనైన శృంగి, పాముతో తన తండ్రిని అవమానపరిచిన పరీక్షిత్తు పాము కారణంగానే ఏడవరోజున మరణిస్తాడంటూ శపించాడు. పరీక్షిత్తు ఎన్నో పుణ్య కార్యాలు చేసినప్పటికీ ఆ శాపం నుంచి మాత్రం ఆయన తప్పించుకోలేక పోయాడు.

More Bhakti Articles