వెన్నవరం

వెన్నవరం
శివ కేశవులు కొలువుదీరిన క్షేత్రాలు పరమ పవిత్రమైనవిగా ... ఎంతో విశిష్టమైనవిగా చెప్పబడుతున్నాయి. అలాంటి మహిమాన్వితమైన క్షేత్రాలలో ఒకటిగా మనకి 'వెన్నవరం' కనిపిస్తుంది. వరంగల్ జిల్లా డోర్నకల్ మండలంలో ఈ క్షేత్రం విరాజిల్లుతోంది. వాడుకభాషలో మార్పుకు లోనైన ఈ ఊరును ప్రస్తుతం 'ఎన్నారం' అని పిలుస్తుంటారు.

కొండపై శివుడు ... కొండ దిగువున వేంకటేశ్వరుడు ... మధ్యలో కోనేరు ఉండటం ఈ క్షేత్ర విశిష్టతగా చెబుతుంటారు. కొన్ని వందల సంవత్సరాల క్రితం ఒక భక్తుడికి స్వామివారు కలలో కనిపించి ఇక్కడ తాను కొలువుదీరి ఉన్నట్టుగా చెప్పి, ఆలయాన్ని నిర్మించమని ఆదేశించాడట.

దాంతో ఆ భక్తుడు ఈ ప్రదేశానికి వచ్చి పరిశీలించగా, కొండ పైభాగాన శివుడికి సంబంధించిన ఆనవాళ్లు, దిగువున వేంకటేశ్వర స్వామికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించాయి. ఇక కోనేరు దగ్గర కూడా స్వామివారి పాదముద్ర కనిపించింది. దాంతో ఇది మహిమాన్వితమైన క్షేత్రంగా భావించిన ఆ భక్తుడు అటు శివుడికి ... ఇటు వేంకటేశ్వరుడికి ఆలయాన్ని నిర్మించాడు. ఇక కోనేరును స్వామివారి పాద తీర్థంగా భావిస్తుంటారు. ఈ నీటిని కేవలం స్వామివారిని అభిషేకించడానికి ... తీర్థంగా సేవించడానికి మాత్రమే వాడతారు.

ఈ క్షేత్రంలో అడుగుపెట్టగానే ఇది ఒక దివ్య క్షేత్రమనే అనుభూతి కలుగుతుంది. కొండపైనున్న శివుడికి 'మహా శివరాత్రి' సందర్భంగా విశేష పూజలు నిర్వహిస్తారు. అలాగే 'కార్తీక పౌర్ణమి' సందర్భంగా స్వామివారిని దర్శించడానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు. ఇక శ్రీ వేంకటేశ్వర స్వామికి ప్రతి ఏటా ఫాల్గుణ పౌర్ణమి రోజున కల్యాణోత్సవం జరుగుతుంది. అలాగే 'గోకులాష్టమి' ... 'దసరా' ... 'ముక్కోటి ఏకాదశి' పర్వదినాలలో స్వామివారికి ప్రత్యేక పూజలు ... ఉత్సవాలు జరుగుతాయి.

ఇక గ్రామం మధ్యలో కొలువుదీరిన కోదండరామ స్వామి దేవాలయం కూడా చూడదగినదే. ఈ ఆలయం ఊరుకి నిండుదనాన్ని ... పండుగదనాన్ని తెచ్చినట్టుగా కళకళలాడుతూ కనిపిస్తుంది. ఇలా శివకేశవులు కొలువుదీరిన ఈ క్షేత్రాన్ని దర్శించడం వలన, ఆయురారోగ్యాలు ... సిరిసంపదలు కలుగుతాయని భక్తులు అనుభవపూర్వకంగా చెబుతుంటారు.

More Bhakti Articles