శబరిమల

శబరిమల
భక్త శబరిని శ్రీ రామచంద్రుడు అనుగ్రహించిన ప్రదేశమే 'శబరిమల'. ఇక్కడే హరిహర సుతుడుగా చెప్పబడుతోన్న 'శ్రీ ధర్మశాస్త' అవతరించాడు. మహిషి అనే రాక్షస సంహారం కోసం మణిని కంఠాన ధరించి అవతరించాడు కనుక స్వామిని అంతా 'మణికంఠ స్వామి' గా పిలుస్తుంటారు. ఇక ఆయనను చేరదీసిన పందళ రాజ కుటుంబీకులు అయ్య - అప్పా అంటూ ముద్దుగా పిలుచుకునే వారు. దాంతో ఆ స్వామి అయ్యప్పగా ప్రసిద్ధి చెందాడు.

అయ్యప్ప క్షేత్రం కేరళ - పత్తనం తిట్ట జిల్లాలోని పడమటి కనుమలలో పంపానది తీరంలో అలరారుతోంది. ఇక స్వామి ఈ క్షేత్రంలో వెలసిన తీరును పరిశీలిస్తే ... సంతానం లేని పందళ రాజు, అయ్యప్పకు తన రాజ్యాన్ని కట్టబెట్టాలని నిర్ణయించుకుంటాడు. అయితే ఆ తరువాత రాజ దంపతులకు సంతానం కలగడంతో, రాజు నిర్ణయాన్ని రాణి వ్యతిరేకిస్తుంది. అయ్యప్ప అడ్డు తప్పించుకోవడం కోసం, తన వ్యాధికి ఔషధంగా పులిపాలు తీసుకురమ్మని చెబుతుంది.

ఈ పనిమీద అయ్యప్ప బయలుదేరడంతో, అతను దారిలో ఆకలి తీర్చుకోవడానికి కావలసిన తినుబండారాలు ... పూజ చేసుకునేందుకు అవసరమైన సామాగ్రిని రెండు అరలు గల సంచీలో వేసి రాజు మూట కడతాడు. ఈనాటి 'ఇరుముడి'కి కారణమైన ఘట్టం ఇదే. కారణజన్ముడైన అయ్యప్ప పులిపాలను తెచ్చి రాణీకి అందజేస్తాడు. ఆ తరువాత శబరిమలను అధిరోహించి జ్యోతి స్వరూపంలో ఇక్కడ అవతరించాడు. ఈ స్వామిని దర్శించాలంటే నల్లని వస్త్రాలతో మండలదీక్ష తీసుకుని ... నియమ నిష్టలతో పూజాది కార్యక్రమాలను నిర్వహిస్తూ ఇరుముడితో కొండకు చేరుకోవాలి.

పులి పాలకోసం ఒకప్పుడు అయ్యప్ప నడిచిన మార్గమే నేడు 'పెద్దపాదం' (ఎరుమేలి) గా పిలవబడుతోంది. అయ్యప్ప స్వామికి అత్యంత సన్నిహితుడైన 'వావరు స్వామిని' దర్శించుకుని బయలుదేరిన వారికి, మహిషిని స్వామి సంహరించిన ప్రదేశం ... ఉదయనుడు అనే బందిపోటును వధించిన ప్రదేశం దర్శనమిస్తాయి. ఆ తరువాత 'కరిమల' మీదుగా పంపాతీరానికి చేరుకొని, ఇక్కడి 'సాక్షి గణపతి'కి కొబ్బరికాయ కొడతారు.

'నీలిమల' కొండలపై నడక సాగిస్తూ, 'శబరి పీఠం' ... 'శరంగుత్తి' ప్రదేశాలను దర్శిస్తూ సన్నిధాన సమీపానికి చేరుకుంటారు. 'పదునెట్టాoబడి' పేరుతో పిలవబడే 18 మెట్లను ఎక్కిన భక్తులు ప్రదక్షిణ క్రమంలో కన్నిమూల గణపతిని ... సర్పరాజును దర్శించుకుని స్వామి సన్నిధానానికి చేరుకుంటారు. స్వామివారి విగ్రహాన్ని ఇక్కడ ప్రతిష్ఠించిన పరశురాముడే ఈ మెట్ల మార్గాన్ని నిర్మించినట్టు పురాణ గాధ.

స్వామి దర్శనం అనంతరం ఇరుముడి సామాగ్రిని ఆలయానికి సమర్పించి 'మాలికాపురత్తమ్మ' ను సేవించుకుంటారు. ఇక ఆనవాయతీ ప్రకారం పందాళ రాజ వంశీకులు స్వామివారి తిరువాభరణాలను స్వామివారికి సమర్పించే సంప్రదాయం ... వాటిని అనుసరిస్తూ ఆకాశ మార్గాన వచ్చే గరుడ పక్షి ... అందరినీ ఆకట్టుకుంటాయి. మకర సంక్రాంతి పర్వదినం సందర్భంగా ఈ క్షేత్రంలో కనిపించే 'మకర జ్యోతి' ని లక్షాలాది మంది భక్తులు దర్శించి తరిస్తారు.

More Bhakti Articles