కురుక్షేత్రం

కురుక్షేత్రం
కురుక్షేత్రం' ... అనే పేరు వినగానే పాండవులు ... కౌరవులు తలపడిన మహా భారత యుద్ధం గుర్తొస్తుంది. అందుకు వేదికగా నిలిచిన ఈ ప్రదేశం ఇప్పుడు హర్యానా రాష్ట్రంలో దర్శనమిస్తుంది. ఐదువేల సంవత్సరాల క్రితం జరిగిన యుద్ధానికి అద్దం పడుతోన్న కురుక్షేత్రం ... పవిత్రమైన పుణ్యక్షేత్రం ఎలా అవుతుందని చాలామంది అనుకుంటూ వుంటారు. అలాంటి వారికి ముందుగా 'కురురాజు' గురించి చెప్పవలసి వుంటుంది.

పూర్వం కురుమహారాజు ఈ ప్రదేశంలో ఎనిమిది రకాల సద్గుణాలను పండించడానికి ప్రయత్నిస్తుండగా, శ్రీ మహా విష్ణువు ప్రత్యక్షమయ్యాడు. ఆ సద్గుణాలు ఎక్కడ ఉన్నాయో చూపితే తాను వాటిని నాటుతానని చెప్పాడు. తనలోనే ఆ సద్గుణాలు ఉన్నాయంటూ, శ్రీ మహా విష్ణువుకి తన శరీరాన్ని అప్పగించాడు కురుమహారాజు. అతని శరీరాన్ని వేయి ఖండాలుగా చేసి వాటిని శ్రీ మహా విష్ణువు ఆ ప్రదేశంలో నాటాడు.

ఈ పుణ్య భూమిలో ఎవరు మరణించినా స్వరానికి వెళ్లేలా ఆ స్వామి నుంచి కురుమహారాజు వరాన్ని పొందాడు. ఈ కారణంగానే పాండవులు ... కౌరవులు తమ యుద్ధభూమిగా ఈ పుణ్య భూమిని ఎంచుకున్నారు. కురుక్షేత్ర యుద్ధానికి ముందే ఈ పుణ్య భూమిలో బ్రహ్మాది దేవతలు నడయాడారు ... అనేక మంది మహర్షులు యజ్ఞ యాగాలు నిర్వహించారు. సరస్వతీ తదితర నదులు ప్రవహించి ఈ ప్రదేశాన్ని మరింత పవిత్రం చేశాయి.

ఇక బ్రహ్మదేవుడు సృష్టి రచన ఆరంభించినది ... వ్యాస మహర్షి పురాణాలు రచించినది ... విష్ణు సహస్ర నామం అవతరించినది ... శ్రీ కృష్ణుడు గీతోపదేశం చేసినది ఇక్కడే. ఈ కారణంగానే కురుక్షేత్రం ... విశిష్ట పుణ్యక్షేత్రాల సరసన స్థానం సంపాదించుకోగలిగింది. ఆనాటి ఆనవాళ్లు ఇప్పటికీ ఇక్కడ కనిపిస్తూ వుంటాయి. ఇక్కడి 'సన్నిహిత సరోవరం' లో ప్రతి పౌర్ణమికి అన్ని పుణ్య తీర్థాలు కలుస్తుంటాయని చెబుతుంటారు. అలాగే బ్రహ్మ సరోవరం కూడా అత్యంత మహిమాన్వితమైనదని అంటారు. సూర్య గ్రహణ సమయంలో ఈ సరస్సులలో స్నానమాచరించడానికి లక్షలాదిగా భక్తులు తరలి వస్తుంటారు.

ఈ సరోవరాల్లో స్నానమాచరించి, ఒడ్డున గల లక్ష్మీనారాయణులని ... ద్రువనారాయణ మూర్తిని ... దుర్గాదేవిని దర్శిస్తుంటారు. ఈ విధంగా చేయడం వలన దోషాలు తొలగిపోతాయనీ, మోక్షం లభిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు.

More Bhakti Articles