ఉడిపి

ఉడిపి
శ్రీకృష్ణ పరమాత్ముడు ఆవిర్భవించిన మహిమాన్వితమైన క్షేత్రాలలో 'ఉడిపి' ఒకటి. తన లీలా విన్యాసాలలోని భాగంగానే శ్రీ కృష్ణుడు ఆవిర్భవించిన ఈ క్షేత్రం కర్ణాటక రాష్ట్రంలోని మంగుళూరు సమీపంలో అలరారుతోంది. మధ్వాచార్యులు తన శిష్య గణంతో కలిసి ద్వైత మతాన్ని ప్రచారం చేస్తూ అనేక క్షేత్రాలను దర్శించాడు. ఆ సమయంలో తనకి లభించిన కృష్ణుడి విగ్రహాన్ని ఆయన ఉడిపిలో ప్రతిష్ఠించాడు. నాటి నుంచి స్వామికి నిత్య పూజలు ... విశేష ఉత్సవాలు నిర్వహించడం మొదలైంది.

మధ్వాచార్యుల వారు తన శిష్య బృందంలోని ఎనిమిది మంది ఉత్తములను ఎంపిక చేసి, వారితో ఎనిమిది మఠాలను ఏర్పాటు చేయించారు. ఒక మఠం తరువాత మరొక మఠం వారు వంతుల వారిగా ఉడిపి శ్రీకృష్ణుడి పూజా కార్యక్రమాలను నిర్వహించేలా ఏర్పాటు చేశాడు. ఇక్కడి శ్రీ కృష్ణుడుని భక్తజన బాంధవుడనీ ... పిలిస్తే పలుకుతాడని చెబుతుంటారు. ఇందుకు నిదర్శనంగా 'కనకదాసు' కథను గురించి చెబుతుంటారు.

పూర్వం 'తిమ్మప్ప' అనే యువకుడు విజయనగర సామ్రాజ్యానికి చెందిన సైన్యంలో పనిచేసేవాడు. పరాక్రమవంతుడైన తిమ్మప్ప, ఏదైనా కండబలంతో సాధించవచ్చని నమ్మేవాడు. అందువలన దేవాలయాల వైపు కన్నెత్తి చూసేవాడు కాదు. అలాంటి తిమ్మప్పను ఒకానొక ఆపద నుంచి శ్రీ కృష్ణుడు కాపాడటంతో, ఆయన భక్తుడిగా మారిపోతాడు. కనకదాసుగా మారిపోయిన తిమ్మప్ప , శ్రీ కృష్ణుడిని దర్శించుకోవడానికి ఉడిపి చేరుకున్నాడు. కులతత్వం కారణంగా ఆలయ అధికారులు అతణ్ణి లోపలి అనుమతించక పోవడంతో, దేవాలయం వెనుక భాగానికి చేరుకొని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అంతే ఆ వైపున గల గోడ కూలిపోవడమే కాకుండా, తూర్పు ముఖంగా గల శ్రీ కృష్ణుడు పశ్చిమ ముఖంగా తిరిగి కనకదాసుకు దర్శనమిచ్చాడు.

కనకదాసు నుంచున్న ప్రదేశంలో ఆయన పేరుతో నిర్మించిన మంటపం ఇప్పటికీ కనిపిస్తుంది. గతంలో గోడ కూలిన ఆ భాగంలోనే కిటికీని అమర్చారు. భక్తులు ఈ కిటికీ గుండానే ఇప్పటికీ స్వామివారిని దర్శించుకుంటూ వుంటారు. పర్యాయ ఉత్సవాల పేరుతో ఇక్కడ జరిగే ఉత్సవాలలో భక్తులు వేల సంఖ్యలో పాల్గొంటూ వుంటారు.

More Bhakti Articles