తిరుమల గిరి

తిరుమల గిరి
కలియుగ దైవమైన శ్రీవేంకటేశ్వరుడు ... శ్రీదేవి - భూదేవి సమేతంగా కొలువుదీరిన పుణ్యక్షేత్రం 'తిరుమలగిరి'. ప్రాచీనవైభవానికి నిదర్శనంగా నిలిచి, అడుగడుగునా ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతోన్న ఈ క్షేత్రం కృష్ణా జిల్లా జగ్గయ్యపేట సమీపంలో వెలుగొందుతోంది. పూర్వం భరద్వాజ మహర్షి ఈ కొండపై శ్రీ మహావిష్ణువు గురించి కఠోర తపస్సు చేశాడు. ఆయన తపస్సుకు మెచ్చిన శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యాడు.

భక్తుల దర్శనార్థం ఈ కొండపై కొలువుదీరవలసిందిగా ఆయన శ్రీ మహావిష్ణువును కోరడంతో అందుకు స్వామి అంగీకరించాడు. ఇచ్చిన మాట ప్రకారం ఈ కొండపై శ్రీ వేంకటేశ్వరస్వామిగా ఆవిర్భవించాడు. లక్ష్మీదేవిని వెదుక్కుంటూ భూలోకానికి వచ్చిన శ్రీనివాసుడు, ఓ పుట్టలో తల దాచుకోవడం ... ఆ పుట్టపై ఒక ఆవు ప్రతినిత్యం పాలధారను కురిపించి ఆయన ఆకలి తీర్చిన కథ తెలిసినదే. అందుకు నిదర్శనంగా ఈ క్షేత్రంలో స్వామివారు పుట్టతో సహా వెలవడం విశేషంగా చెబుతుంటారు.

ఈ కొండపై పూజకు అవసరమైన జలాలు లేకపోవడంతో, వాటి విషయాన్ని గురించి భరద్వాజ మహర్షి స్వామివారి దగ్గర ప్రస్తావించాడట. దాంతో స్వామి వారు తాను పాదం మోపిన ప్రదేశంలోనే 'జల' పడేలాచేసి అక్కడ కోనేరు ఏర్పడేలా చేశారని చెబుతుంటారు. అందుకు నిదర్శనంగానే పాదం ఆకారంలో ఇక్కడ కోనేరు కనిపిస్తూ వుంటుంది.

స్వామి స్వయంభువుగా వెలసిన క్షేత్రం కావడంతో, ఈ క్షేత్రం ఎంతో ప్రసిద్ధి చెందింది. విశేషమైనటువంటి పర్వదినాల్లో ఇక్కడ ఉత్సవాలు ... ఊరేగింపులు జరుగుతుంటాయి. ఈ సమయంలో అత్యధిక సంఖ్యలో వచ్చిన భక్తులు స్వామివారిని దర్శించి కానుకలు ... మొక్కు బళ్ళు చెల్లిస్తుంటారు.

More Bhakti Articles