శ్రీ దానేశ్వరీ క్షేత్రం

శ్రీ దానేశ్వరీ క్షేత్రం
దేవుడు ఒకడే అయినప్పటికీ ఆయన కొలువుదీరిన క్షేత్రం చారిత్రక వైభవాన్ని సంతరించుకుంటే ఒక విధమైన అనుభూతిని అందిస్తుంది. అలాగే పురాణ సంబంధమైన నేపథ్యాన్ని సంతరించుకుంటే మరో విధమైన అనుభూతిని అందిస్తుంది. అలా పురాణ సంబంధమైన నేపథ్యాన్ని కలిగివున్న క్షేత్రాలలో 'శ్రీ దానేశ్వరీ' అమ్మవారి ఆలయం ఒకటి. ఇది పశ్చిమ గోదావరి జిల్లాలోని 'తణుకు' తాలూకాలోని 'దువ్వ'లో దర్శనమిస్తుంది.

ప్రాచీనమైన ఈ క్షేత్రం అమ్మవారి మహిమలకు అద్దం పడుతూ ఉంటుందని భక్తులు చెబుతుంటారు. తనని నమ్మిన భక్తులను ఆమె కంటికి రెప్పలా కాపాడుతుందని విశ్వసిస్తుంటారు. ముఖ్యంగా అమ్మవారు కొలువుదీరిన పరిసర ప్రాంతాల్లో ఎలాంటి ప్రమాదాలు గానీ ... ఆపదలుగాని జరక్కుండా రక్షిస్తూ ఉంటుందని అంటారు. అందుకు ఇక్కడ ఎన్నో నిదర్శనాలు కనిపిస్తూ వుంటాయి ... ఎందరి అనుభవాలో వినిపిస్తూ వుంటాయి.

ఈ కారణంగానే ఈ మార్గంలో ప్రయాణించే వారు అమ్మవారిని దర్శించుకుని వెళుతుంటారు. తల్లి తన బిడ్డలనుంచి ఏమీ ఆశించదు ... అలాగే ఇక్కడి అమ్మవారు కూడా తన బిడ్డలు తనని దర్శించడంతోనే సంతోష పడుతుంది ... సంతృప్తి చెందుతుంది. అమ్మవారి కరుణా కటాక్ష వీక్షణాలు భక్తులకు దక్కేలా చేసిన భాగ్యం 'దూర్వాస మహర్షి' కి దక్కుతుంది. దూర్వాస మహర్షి తన తపోబలంతో అమ్మవారిని ప్రసన్నం చేసుకుని ... ఆమె ప్రతిరూపాన్ని ఇక్కడ ప్రతిష్ఠించినట్టు స్థలపురాణం చెబుతోంది.

దూర్వాస మహర్షి పేరుమీదనే ఈ క్షేత్రం ఒకప్పుడు దూర్వాసపురంగా ... దూర్వాపురంగా పిలవబడిందనీ, కాలక్రమంలో అది 'దువ్వ' గా మారిందని చెబుతారు. దాతల సహాయ సహకారాలతో ఆలయ అభివృద్ధి జరుగుతూ వచ్చింది. సంతాన సౌభాగ్యాలను ప్రసాదించే తల్లిగా అమ్మవారిని ఆరాధించే వారి సంఖ్య రోజురోజుకీ పెరుగుతోంది. పర్వదినాల సమయంలో ఇక్కడ విశేష పూజలు జరుగుతుంటాయి. ఈ సమయంలో ఆలయానికి భక్తుల తాకిడి ఎక్కువగానే వుంటుంది.

More Bhakti Articles