పెనుగంచిప్రోలు

పెనుగంచిప్రోలు
దైవాంశతో భూమిపై మానవ రూపంలో జన్మించి, తమ అవతారకార్యం పూర్తికాగానే దైవంగా ఆరాధించబడుతున్న శక్తి స్వరూపాలను మనం చూస్తూనే వుంటాం. అలా లక్ష్మీ ... పార్వతి ... సరస్వతుల అంశతో కొలువుదీరిన దేవతా మూర్తియే 'శ్రీలక్ష్మీతిరుపతమ్మ' అమ్మవారు. భక్త జనకోటికి అభయమై అలరారుతోన్న ఈ క్షేత్రం కృష్ణాజిల్లా నందిగామ సమీపంలో దర్శనమిస్తుంది. పూర్వం 'పెదకంచి' పేరుతో పిలవబడిన ఈ ప్రదేశం కాలక్రమంలో పెనుగంచిప్రోలుగా మార్పుచెందింది.

భూదేవి కోరికపై మానవరూపంలో జన్మించిన త్రిశక్తి స్వరూపిణి, గృహిణిగా ఆదర్శవంతమైన జీవితాన్ని కొనసాగించింది. అయితే తన ఆవిర్భావానికి ముందే జ్యేష్టాదేవికి ఇచ్చిన మాట మేరకు, ఆమె వలన అమ్మవారు అనేక కష్టాలను ఎదుర్కుని దైవశక్తిగా నెలవైవుంది. సతీ ధర్మానికి సరైన అర్థం చెప్పిన అమ్మవారు తన భర్త గోపయ్యతో కలిసి ఇక్కడ పూజలు అందుకుంటూ వుంటుంది. అమ్మవారు ఆదేశించిన ప్రకారం లక్ష్మీ తిరుపతమ్మ బావ - తోడికోడలుకి కూడా ఇదే ఆలయంలో పూజలు జరుగుతుంటాయి.

విశాలమైన ఆలయ ప్రాంగణం ... లోపల కొలువుదీరిన అమ్మవారి వివిధ రూపాలు కళ్ళను కట్టిపడేస్తాయి. సాధారణ రోజుల్లో శుక్ర - ఆది వారాల్లో భక్తులు ఎక్కువగా ఇక్కడికి వస్తుంటారు. ఇక మాఘశుద్ధ పౌర్ణమి నుంచి అయిదు రోజుల పాటు అమ్మవారి కళ్యాణోత్సవాలు ఘనంగా నిర్వహిస్తుంటారు. మాలధారణతో మండల దీక్ష పూర్తి చేసిన భక్తులు పెద్దసంఖ్యలో అమ్మవారిని దర్శించుకుంటూ వుంటారు.

ప్రదక్షిణ మార్గంలో బయలుదేరిన భక్తులు ముందుగా వేపచేట్టును దర్శించుకుని ఆ తరువాతనే అమ్మవారిని దర్శించుకోవడం ఇక్కడ ఆనవాయతీగా వస్తోంది. తిరుపతమ్మ తల్లి చల్లగా చూస్తుందనీ ... కోరిన వరాలను ప్రసాదిస్తుందని భక్తులు విశ్వసిస్తుంటారు.

More Bhakti Articles