కోణార్క్ సూర్యదేవాలయం

కోణార్క్ సూర్యదేవాలయం
ప్రపంచ వ్యాప్తంగా వున్న సూర్య దేవాలయాల్లో కోణార్క్ సూర్య దేవాలయానికి విశిష్టమైన స్థానం వుంది. చారిత్రక వైభవం ... ఆధ్యాత్మిక వైభవం ఇక్కడి నిర్మాణాలలో సమతూకంగా కనిపిస్తుంటాయి. ప్రాచీనతను సంతరించుకున్న ఈ ఆలయం పూరీ జగన్నాథ స్వామి ఆలయానికి 35 కిలోమీటర్ల దూరంలో అలరారుతోంది. ఇక్కడి ఆలయంలోని శిల్పకళా సంపద ప్రతి ఒక్కరిని ఆశ్చర్యచకితులను చేస్తుంది.

సూర్యుడి రథం ఆకారంలో దర్శనమిచ్చే ఆలయంలో, 7 గుర్రాలు ... 24 చక్రాల అమరిక అద్భుతాన్ని ఆవిష్కరిస్తాయి. ఇక్కడ ఈ క్షేత్రం ఆవిర్భవించడానికి గల కారణాలను పరిశీలిస్తే, శ్రీ కృష్ణుడి కుమారుడైన సాంబుడి పేరు వినిపిస్తుంది. శాపవశాత్తు సాంబుడిని చర్మ సంబంధమైన వ్యాధి పట్టి పీడిస్తూ ఉండటంతో, ఆయన ఈ ప్రదేశానికి చేరుకొని 12 సంవత్సరముల పాటు సూర్యుడి అనుగ్రహాన్ని కోరుతూ తపస్సు చేశాడు. సూర్యుడి కటాక్షంతో ఆ వ్యాధి నుంచి బయటపడి, ఆయన ఆలయాన్ని నిర్మించాలని సంకల్పించుకున్నాడు.

ఒకరోజున ఆయన 'చంద్రభాగ' నదిలో స్నానం చేస్తుండగా సూర్యుడి ప్రతిమ లభించింది. విశ్వకర్మచే మలచబడిన ఆ విగ్రహాన్నే సాంబుడు ఈ ప్రదేశంలో ప్రతిష్ఠించినట్టుగా చెబుతారు. కాలక్రమంలో ఇక్కడి స్వామివారికి గంగ వంశానికి చెందిన నరసింహదేవుడు ఆలయాన్ని నిర్మించాడు. 12 వందలమంది శిల్పులు 12 సంవత్సరాల పాటు ఆలయనిర్మాణంలో పాలుపంచుకున్నారు. వారి శ్రమ కారణంగానే ఈ ఆలయానికి అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది.

మతపరమైన దాడులకు పాల్పడిన కొందరు ఆలయ నిర్మాణాలను పాక్షికంగా దెబ్బతీయడమే కాకుండా, ప్రాచీన కాలంనాటి ధ్రువమూర్తిని మాయంచేశారు. అయినా ఇది నాటి వైభవానికి నేటికీ అద్దం పడుతూనే వుంది ... ఆధ్యాత్మిక పరిమళాలను వెదజల్లుతూనే వుంది. ప్రతియేడాది 'రథ సప్తమి' రోజున ఇక్కడికి అత్యధిక సంఖ్యలో భక్తులు చేరుకుంటారు. చంద్రభాగ నదిలో స్నానం చేసి ఇక్కడి నవగ్రహాలను దర్శించుకుని పునీతులవుతూ వుంటారు.

More Bhakti Articles