నవనందులు

నవనందులు
శివుడి వాహనమైన నందీశ్వరుడు ఆయనని చూడకుండా క్షణమైనా ఉండలేడు. అందుకే శివయ్య ఎక్కడ వెలసినా నంది ఆయనను చూస్తూ ఎదురుగానే బుద్ధిగా కూర్చుని కనిపిస్తుంటాడు. తనకి శివుడికి మధ్యలో భక్తులు ఏ మాత్రం అడ్డొచ్చినా ఆయన మహా బాధపడిపోతాడు. ఈ కారణంగానే భక్తులు ముందుగా ఆయన అనుగ్రహాన్ని సంపాదించుకుని, ఆ తరువాత శివయ్యని దర్శిస్తూ వుంటారు.

అలా శివయ్యను కనిపెట్టుకుని వుండే నంది పేరున వివిధ క్షేత్రాలు విలసిల్లుతున్నాయి. అలాంటి వాటిలో 'నవనందులు' విశిష్టమైనవిగా అలరారుతున్నాయి. కర్నూలు జిల్లాలో ప్రసిద్ధ పుణ్య క్షేత్రమైన 'మహా నంది'తో పాటు అక్కడికి దగ్గరలో వున్న మిగతా ఎనిమిది నంది క్షేత్రాలను కలుపుకుని 'నవనంది క్షేత్రాలు'గా పిలవబడుతున్నాయి. ఇవన్నీ నంది పేరునే కనిపిస్తున్నప్పటికీ ఆయన శివుడితో కలిసే ఇక్కడ పూజలు అందుకుంటూ ఉంటాడు.

శివుడు 'నందీశ్వరుడు' గా వెలసినది 'ప్రథమనంది' గా, పరమశివుడి అనుగ్రహాన్ని కోరుతూ నాగులు తపస్సు చేసినది 'నాగనంది' గా అలరారుతున్నాయి. చంద్రుడు తపమాచరించిన ప్రదేశం 'సోమనంది' గా ... రుషి గణాలు పూజించినది 'శివనంది' గా విలసిల్లుతున్నాయి. ఇక ముక్కంటి కోసం సూర్యుడు తపస్సు చేసిన ప్రదేశం 'సూర్య నంది'గా, సాక్షాత్తు శ్రీమన్నారాయణుడు శివుడి కోసం తపస్సు చేసిన ప్రదేశం 'విష్ణునంది'గా పూజలు అందుకుంటున్నాయి.

దేవాధిదేవతలు పూజించిన కారణంగా 'మహానంది' గా, వినాయకుడు పూజించినది 'వినాయక నంది' గా , గరుత్మంతుడు తపస్సు చేసిన ప్రదేశం 'గరుడనంది'గా ప్రసిద్ధి చెందాయి. కార్తీక మాసంలో ఈ నవనందులను దర్శించుకోవడం వలన అనంతమైన పుణ్య ఫలాలు లభిస్తాయని అంటారు. ఇక ఇవన్నీ కూడా ముప్పై కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి కనుక ఒక్కరోజులోనే అన్నింటిని దర్శించుకోవచ్చు. ఇలా నవనందులను ఒకే రోజున దర్శించుకుంటే భూప్రదక్షిణ చేసినంత ఫలితం దక్కుతుందని పురాణాలు చెబుతున్నాయి.

More Bhakti Articles