భీముని పాదం

భీముని పాదం
ప్రకృతి సౌందర్యం ... ఆధ్యాత్మిక వాతావరణం ... చారిత్రక ఘట్టాలు వీటన్నిటి సమాహారంగా కనిపిస్తూ కనువిందు చేసే క్షేత్రమే 'భీమునిపాదం' . చూడగానే మంత్ర ముగ్ధులను చేస్తూ మనసుని ప్రశాంతతకు మందిరంగా చేసే ఈ క్షేత్రం వరంగల్ జిల్లా గూడూరు మండలం లోని సీతానగరం సమీపంలో అలరారుతోంది.

పూర్వం పాండవులు అరణ్య వాసం చేస్తూ ఈ ప్రాంతానికి వచ్చారట. ఆ సమయంలో ఓ కుటుంబం మంటల్లో చిక్కుకోగా భీముడు ఇక్కడి జలపాతంలోని నీరుతోనే ఆ మంటలు ఆర్పేసి వారిని రక్షించాడని అంటారు. అందుకు నిదర్శనంగా ఇక్కడ కనిపించే అతిపెద్దదైన పాద ముద్ర ఆయనదేనని చెబుతుంటారు. ఈ పాదముద్ర పై నుంచి జలపాతం కిందకి దూకుతుంటుంది. ఈ కారణంగానే ఈ క్షేత్రానికి భీముని పాదం అనే పేరు వచ్చింది.

పరిసర ప్రాంతాల్లోని గ్రామస్తులు ఈ జలధార పై ఆధారపడే వ్యవసాయం చేస్తుంటారు. వీరంతా కూడా ప్రతి యేటా వ్యవసాయ పనులు ప్రారంభించే ముందు ఇక్కడికి వచ్చి ఈ జలపాతంలో స్నానాలు చేస్తారు. ఆ పక్కనే ఆరుబయట వున్న శివలింగాన్ని ... నాగదేవత విగ్రహాన్ని భక్తి శ్రద్ధలతో పూజిస్తారు. అక్కడే వంటలు చేసి స్వామివారికి నైవేద్యంగా సమర్పించి, దానిని తాము ప్రసాదంగా స్వీకరిస్తారు. ఇక్కడి స్వామివారి పట్ల వాళ్లు అచెంచలమైన భక్తి విశ్వాసాలను కలిగి వుంటారు.

ఈ జలపాతం పక్కనే ఒక గుహ వుంది. ఇక్కడికి పది కిలోమీటర్ల దూరంలో గల 'బల్లకొండ' ఆలయం వరకూ ఈ గుహ మార్గం వుందని చెబుతారు. పూర్వం అక్కడ తపస్సు ఆచరించిన ఋషులు ఈ గుహమార్గంలో ఇక్కడికి వచ్చి స్నానాలు ఆచరించే వారని అంటారు. ఇక ఆధ్యాత్మిక ప్రభావం సంగతి అటుంచితే, ఇక్కడి ప్రకృతి సౌందర్యం చూసి తరించడానికి వివిధ ప్రాంతాల నుంచి ఎంతో మంది యాత్రికులు వస్తుంటారు. జలపాతం కింద స్నానాలు చేసి మానసికపరమైన ఒత్తిడి నుంచి విముక్తులవుతుంటారు.

More Bhakti Articles