ఎద్దులకొండ

ఎద్దులకొండ
పురాణాలను పరిశీలిస్తే మానవులైనా ... దానవులైనా అడిగినదే తడవుగా వాళ్లకి వరాలను ప్రసాదించే దేవతలుగా బ్రహ్మ ... శివుడు కనిపిస్తారు. వారు ప్రసాదించిన వరాలతో దానవులు దుర్మార్గాలకు పాల్పడుతున్నప్పుడు శ్రీమన్నారాయణుడు రంగంలోకి దిగుతాడు. దానవులు పొందిన వరాలలో లోపాలను గుర్తించి ఆ దిశగానే వారి ఆటకట్టిస్తుంటాడు.

ఇదే విషయం మనకి మరోమారు స్పష్టం చేస్తుంది 'వృషభాచల క్షేత్రం'. ఇది కడప జిల్లా పులివెందుల సమీపంలోని వేంపల్లె గ్రామంలో దర్శనమిస్తుంది. ఇక్కడి ఎత్తైన కొండను అంతా 'ఎద్దులకొండ' అని పిలుస్తుంటారు. ఈ కొండపైనే పద్మావతీ సమేత వేంకటేశ్వర స్వామి ఆవిర్భవించాడు. పూర్వం 'వృషభాసురుడు' అనే రాక్షసుడు దేవతలవలన గానీ ... దానవులవలన గానీ ... మానవుల వలన గాని తనకి మరణం లేకుండా బ్రహ్మ నుంచి వరాన్ని పొందాడు. అప్పటి నుంచి సాధుజనులను అనేక విధాలుగా బాధించడం మొదలుపెట్టాడు.

దాంతో దేవగణాలు ... ముని గణాలు శ్రీమహావిష్ణువుకి పరిస్థితిని వివరించి ఆందోళనను వ్యక్తం చేశారు. వృషభాసురుడుకి బ్రహ్మ ఇచ్చిన వరాన్ని ఒకసారి గుర్తుచేసుకున్న శ్రీమహావిష్ణువు, ఆ వారంలో జంతువుల ప్రస్తావన లేకపోవడంతో, ఎద్దురూపంలో ఆ రాక్షసుడితో పోరాడి సంహరించాడు. అనంతరం అమ్మవారితో కలిసి ఈ క్షేత్రంలో ఆవిర్భవించాడు. ద్వాపరయుగంలో జరిగిన ఈ సంఘటనకు వేదికగా నిలిచిన ఈ కొండ 'ఎద్దులకొండ'గా ప్రసిద్ధి చెందగా, స్వామివారు 'వృషభాచలేశ్వరుడు' గా పూజలు అందుకుంటున్నాడు.

ధనుర్మాసంలో ఇక్కడ విశేష పూజలు ... ఉత్సవాలు ఘనంగా జరుగుతుంటాయి. కోరిన కోరికలను స్వామి వెంటనే తీరుస్తాడనే విశ్వాసం కారణంగా, వివిధ ప్రాంతాల నుంచి ఇక్కడికి వచ్చే భక్తుల సంఖ్య ఎక్కువగా వుంటుంది.

More Bhakti Articles